ఇరాన్‌పై అమెరికా దాడులు అట్టర్‌ ఫ్లాప్‌..! టార్గెట్‌ను కొట్టలేదంటూ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌..

అమెరికా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై చేసిన వైమానిక దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపలేదని, కేవలం ఆలస్యం చేశాయని పెంటగాన్ నిఘా నివేదిక వెల్లడించింది. ట్రంప్ ప్రకటనలకు విరుద్ధంగా, అణు కేంద్రాలు పూర్తిగా నాశనం కాలేదు, సుసంపన్న యురేనియం నిల్వలు సురక్షితంగా ఉన్నాయని నివేదిక తెలిపింది.

ఇరాన్‌పై అమెరికా దాడులు అట్టర్‌ ఫ్లాప్‌..! టార్గెట్‌ను కొట్టలేదంటూ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌..
Iran Vs Usa

Updated on: Jun 25, 2025 | 8:22 AM

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకొని.. ఇరాన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌ అణు బాంబులు తయారు చేయకుండా చేసేందుకు.. ఆ దేశంలోని మూడు అణు కేంద్రాలపై దాడులు చేసి, వాటిని విజయవంతంగా నాశనం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే.. ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్‌లోని అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపలేకపోయారని అమెరికా నిఘా సంస్థ నివేదిక తెలిపింది.

పెంటగాన్ నిఘా విభాగం అయిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసిన నిఘా నివేదిక ప్రకారం.. ఇరాన్ అణు కేంద్రాల పరిస్థితికి సంబంధించి అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన వాదనలకు భిన్నంగా ఉంది. జూన్ 22న అమెరికా ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లోని మూడు అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఈ కేంద్రాలను అణు బాంబును అభివృద్ధి చేయడానికి రహస్యంగా ఉపయోగిస్తున్నారని అమెరికా, ఇజ్రాయెల్‌ ఆరోపించాయి.

అయితే ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించినప్పటికీ, అవి పూర్తిగా నాశనం కాలేదని నివేదిక వెల్లడించింది. దాడుల అంచనా గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలు నాశనం కాలేదని అన్నారు. సెంట్రిఫ్యూజ్‌లు చాలావరకు చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపారు. అమెరికా దాడులకు ముందే నిఘా అంచనా వేసిన సుసంపన్న యురేనియంను సైట్ల నుండి తరలించారని సమాచారం. అమెరికా చేసిన దాడులతో ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని కాస్త ఆలస్యం చేయగలిగిందే కానీ, దాన్ని ఆపలేకపోయిపోయిందని నివేదిక చెబుతోంది.

అయితే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని ఆపలేదు, ఆలస్యం మాత్రమే చేశాయనే వాదనలను వైట్ హౌస్ తీవ్రంగా తోసిపుచ్చింది. ఘాటైన పదజాలంతో కూడిన ప్రకటనలో వైట్ హౌస్ ఈ అంచనాను పూర్తిగా తప్పు అని పేర్కొంది. ఈ అంచనాను లీక్ చేయడం అధ్యక్షుడు ట్రంప్‌ను కించపరిచే స్పష్టమైన ప్రయత్నం, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించడానికి సంపూర్ణంగా అమలు చేసిన ధైర్య యుద్ధ పైలట్లను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి