
అగ్రరాజ్యంపై ‘ఫెర్న్’ (Fern) అనే భారీ మంచు తుఫాను విరుచుకుపడుతోంది. రాబోయే మూడు నాలుగు రోజులు అమెరికాలోని సగం జనాభాకు నిద్రలేని రాత్రులే అని చెప్పాలి. దాదాపు 30 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అసలు ఈ తుఫాను ఎక్కడ మొదలైంది? పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వింటర్ స్టార్మ్ ఫెర్న్ అనే శక్తివంతమైన మంచు తుఫాను.. అమెరికా తూర్పున మూడింట రెండు వంతులను తాకనుంది. ఇది భారీ తుఫాన్. దీని ప్రభావంతో మంచుతో కూడిన వర్షం, తీవ్రమైన చలి గాలులు ప్రమాదకరమైన మిశ్రమంతో దూసుకువస్తోంది. ఈ తుఫాను 230 మిలియన్లకు పైగా అమెరికా ప్రజలను ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెక్సాస్, న్యూ మెక్సికో నుండి మిడ్‌వెస్ట్, దక్షిణ – ఈశాన్య ప్రాంతాల వరకు ప్రయాణ అంతరాయాలు, విద్యుత్తు అంతరాయాలు, ప్రాణాంతక చలి ఉంటుందని భావిస్తున్నారు.
దక్షిణ రాకీస్ మీదుగా తుఫాను ఏర్పడటం ప్రారంభించిందని, శుక్రవారం (జనవరి 23) నుండి సోమవారం (జనవరి 26) వరకు తూర్పు దిశగా కదులుతూ మరింత బలపడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తుఫాను ఉత్తర ప్రాంతాలలో భారీ మంచును కురిపిస్తుందని, దక్షిణ ప్రాంతాన్ని మంచుతో కప్పేస్తుందని జాతీయ వాతావరణ సేవ, ది వెదర్ ఛానల్ పేర్కొంది. మధ్యలో గడ్డకట్టే వర్షం, మంచు తుఫాను కురుస్తుందని వెల్లడించారు.
30 రాష్ట్రాలు… 23 కోట్ల మందిపై ప్రభావం!
అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా వైట్ వాష్ కనిపిస్తోంది. జనవరి 23, శుక్రవారం నుంచి మొదలైన ఈ ‘వింటర్ స్టార్మ్ ఫెర్న్’ ప్రభావం సోమవారం (జనవరి 26) వరకు తీవ్రంగా ఉండబోతోంది. సౌత్, మిడ్-వెస్ట్, నార్త్-ఈస్ట్ ప్రాంతాల్లోని దాదాపు 23 కోట్ల మంది ప్రజలు ఈ తుఫాను గుప్పిట్లో చిక్కుకున్నారు. మంచుతో రోడ్లు, చెట్లు, విద్యుత్ లైన్లను ప్రమాదకరంగా మారుస్తుంది. దీనివల్ల విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుంది. రోడ్లు మూసుకుపోతాయి. ఈశాన్యంలోని కొన్ని ప్రదేశాలలో ఒక అడుగు కంటే ఎక్కువ మంచు పేరుకుపోవచ్చు. దీంతో ప్రయాణాలు చాలా కష్టమవుతుందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
రూట్ మ్యాప్ ఇదీ…
శుక్రవారం : తుఫాను ప్రభావం ఇప్పటికే టెక్సాస్, కాన్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల్లో మొదలైంది. అక్కడ భారీగా మంచు కురుస్తోంది. అటు టెక్సాస్, న్యూ మెక్సికో, కొలరాడో ప్రాంతాలలో మంచు, మంచుతో కూడిన వర్షం, గడ్డకట్టే వర్షం ప్రారంభమైంది. మధ్యాహ్నం కల్లా తుఫాన్ ప్రయాణం ప్రమాదకరంగా మారవచ్చు. ముఖ్యంగా హైవేలు, ఎలివేటెడ్ రోడ్లపై, కొన్ని ప్రాంతాలలో మంచు పేరుకుపోయే ప్రమాదం ఉంది.
శనివారం నాటికి, తుఫాను మరింత బలంగా, విస్తృతంగా మారే అవకాశముంది. మిడ్‌వెస్ట్, టేనస్సీ లోయ, కరోలినాస్, జార్జియాలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించవచ్చు. అనేక ప్రాంతాలలో భారీ మంచు, గడ్డకట్టే వర్షం కలిసి ఉండవచ్చు. దీని వలన రోడ్లు మూసివేత, విమానాలు ఆలస్యం, విద్యుత్తు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. రాత్రి వరకు పరిస్థితులు మరింత దిగజారిపోయే అవకాశం ఉంది.
ఆదివారం ఇది మెల్లగా తూర్పు వైపు కదులుతూ సౌత్-ఈస్ట్ రాష్ట్రాలను తాకుతుంది. ఇక్కడ మంచుతో పాటు ప్రమాదకరమైన ‘ఐస్’ వర్షం పడే అవకాశం ఉంది. ఈ తుఫాన్ మిడ్-అట్లాంటిక్, ఈశాన్య ప్రాంతాలకు చేరుకుంటుంది. అక్కడ హిమపాతం, మంచు తీవ్రతరం కావచ్చు. ప్రధాన నగరాలు ప్రయాణానికి కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అయితే తీరప్రాంతాలు మంచు, వడగళ్ళు, భారీ వర్షం కురిసే అవకాశముంది. గ్రేట్ లేక్స్, అప్పలాచియన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో తుఫాను ఇప్పటికీ చురుకుగా ఉంది.
ఇక సోమవారం నాటికి ఈ తుఫాను వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, బాస్టన్ నగరాల వైపు దూసుకెళ్తుంది. అక్కడ ‘నార్-ఈస్టర్’ గా మారి భారీ హిమపాతం సృష్టించే ఛాన్స్ ఉంది. తూర్పు యునైటెడ్ స్టేట్స్‌లో చాలా వరకు విపరీతమైన చల్లని గాలి వీస్తుందని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే బాగా పడిపోతాయి. దీని వలన పైపులు స్తంభించిపోవడం, కొనసాగుతున్న విద్యుత్ సమస్యలు, ఆరోగ్య ప్రమాదాలు సంభవించవచ్చు. ముఖ్యంగా జనజీవనం స్తంభించే అవకాశముంది.
🚨 Major Winter Storm Begins Today 🚨
Heavy snow and crippling ice will impact a large region, along with over 170 million Americans from the Southern Rockies/Plains today towards the Northeast by Sunday.
Be sure to stay safe and follow winter safety: https://t.co/DXnRXKLJ8L pic.twitter.com/hiqONM36iJ
— NWS Weather Prediction Center (@NWSWPC) January 23, 2026
వణికిస్తున్న ‘ఐస్ స్టోమ్’
అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే… దక్షిణ అమెరికాలో (South US) టెక్సాస్ నుంచి కరోలినా వరకు భారీగా ‘ఐస్’ (గడ్డకట్టిన మంచు) పేరుకుపోయే ప్రమాదం ఉంది. కరెంట్ తీగలపై మంచు పేరుకుపోయి స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉంది. దీనివల్ల లక్షల ఇళ్లలో ‘పవర్ కట్స్’ ఉంటాయని, కరెంట్ రావడానికి కొన్ని రోజులు పట్టొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
న్యూయార్క్, డీసీలో భారీగా స్నో
ఇక ఉత్తరాది రాష్ట్రాలైన వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, బాస్టన్ సిటీల్లో అయితే 8 నుంచి 16 అంగుళాల వరకు మంచు కురిసే అవకాశం ఉంది. రోడ్లన్నీ మంచుతో నిండిపోయి ప్రయాణాలు స్తంభించిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి.
రికార్డ్ బ్రేకింగ్ చలి
ఈ తుఫాను వెళ్లిన వెంటనే… మంగళ, బుధవారాల్లో ‘ఆర్కిటిక్ చలి’ అమెరికాను ముంచెత్తనుంది. పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు ‘సున్నా’ కంటే తక్కువగానే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చలిగాలుల తీవ్రతకు (Wind Chills) ఉష్ణోగ్రత -50°F కి పడిపోయే ప్రమాదం ఉంది. బయట చర్మం గాలికి తగిలితే చాలు… గడ్డకట్టుకుపోయేంత చలి అది. ఇప్పటికే 7 రాష్ట్రాల్లో ‘ఎమర్జెన్సీ’ (State of Emergency) ప్రకటించారు. స్కూళ్లు, ఆఫీసులు మూసివేశారు. అధికారులు ప్రజలను ఇళ్లలోనే ఉండమని చెబుతున్నారు. అమెరికాలో ఉన్న మన తెలుగు వారు, భారతీయులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. పవర్ బ్యాంకులు, ఫుడ్, ఎమర్జెన్సీ కిట్స్ దగ్గర పెట్టుకోవడం మంచిది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..