PM Modi-Zelenskyy Phone Talk: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) భారత ప్రధాని మోడీ (PM మోడీ) సోమవారం (డిసెంబర్ 26) ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయమై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ట్వీట్ చేస్తూ, “నేను ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడాను. G20 అధ్యక్ష పదవిని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ వేదికపైనే నేను శాంతి సూత్రాన్ని ప్రకటించాను. ఇప్పుడు దాని అమలులో భారతదేశం భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.
ఐక్యరాజ్యసమితిలో మానవతా సహాయం, మద్దతు కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. “ఐక్యరాజ్యసమితిలో మానవతా సహాయం, మద్దతు కోసం భారత ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాను” అని వోలోడిమిర్ జెలెన్స్కీ ట్వీట్ చేశారు.
ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు పీఎంవో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారత విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఏర్పాట్లు చేయాలని ఉక్రెయిన్ అధికారులను ప్రధాని మోదీ అభ్యర్థించారు.
I had a phone call with @PMOIndia Narendra Modi and wished a successful #G20 presidency. It was on this platform that I announced the peace formula and now I count on India’s participation in its implementation. I also thanked for humanitarian aid and support in the UN.
— Володимир Зеленський (@ZelenskyyUa) December 26, 2022
ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సైనిక పరిష్కారం ఉండదని, ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.
జెలెన్స్కీతో ఫోన్ సంభాషణ సందర్భంగా, శత్రుత్వాలను తక్షణమే ముగించాలని, దౌత్యం, సంభాషణల మార్గానికి తిరిగి రావాలని పీఎం మోడీ పునరుద్ఘాటించారు. మోడీ-జెలెన్స్కీ చర్చలపై, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదంపై నేతలు చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శత్రుత్వాలను త్వరలో ముగించి, చర్చలు, దౌత్య మార్గాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి ప్రధాని మాట్లాడారు.
అంతకుముందు, డిసెంబర్ 16న, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా ప్రధాని మోదీ టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సమయంలో, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన సంభాషణలో, చర్చల దౌత్యం ద్వారా విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని పీఎం మోడీ కోరారు. G-20కి భారతదేశ ప్రస్తుత అధ్యక్ష పదవి గురించి కూడా ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్‌కి తెలియజేశారు.