భీకర టోర్నడోలు అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. వీటి ధాటికి పలు రాష్ట్రాల్లో 34 మంది మృతి చెందగా.. చాలామంది గల్లంతయ్యారు. వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. పెనుగాలులకు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. కార్లు, పెద్ద ట్రక్కులు బోల్తా పడగా.. భారీ చెట్లు సైతం నేలకొరిగాయి. ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతిని 2.50 లక్షల ఇళ్లతోపాటు వాణిజ్య భవనాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎటు చూసినా తెగిన విద్యుత్ తీగలు, కూలిన ఇళ్లతో విషాద దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి.
అటు తుఫాన్లు, ఇటు టోర్నడోల బీభత్సంతో అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. బలమైన ఈదురు గాలులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పెనుగాలులు వీచడంతో..భారీ వాహనాలు సైతం బోల్తా పడ్డాయి. దుమ్ముధూళితో కూడిన గాలుల కారణంగా 50కి పైగా వాహనాలు ఢీకొన్నాయి. కాన్సాస్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాతపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మిస్సోరీలోని బేకరర్స్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది, మిసిసిపీలో ఆరుగురు మృతి చెందగా.. ముగ్గురి ఆచూకీ గల్లంతైంది. టెక్సాస్‌లో జరిగిన వాహన ప్రమాదాల్లో నలుగురు మరణించారు. ఆర్కాన్సాస్ రాష్ట్రంలో మరో ముగ్గురు చనిపోగా.. 29మంది గాయపడ్డారు. అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. షెర్మాన్ కౌంటీలో తుఫాన్ కారణంగా అనేక భవనాలు కూలిపోయాయి.
మరిన్ని టోర్నడోలు వచ్చే అవకాశం ఉందని, అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉండవచ్చని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. టెక్సాస్, కాన్సాస్, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో దీని ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని, అయితే.. ఈసారి వాటి విస్తృతి, తీవ్రత అధికంగా ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం తెలిపింది. అర్కాన్సాస్‌లో సుడిగాలుల నష్టాన్ని సర్వే చేయడానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ఎక్కడికక్కడ స్థానిక అధికారులతో కూడిన టీమ్స్…సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.