
టైటానిక్ షిప్.. తొలి ప్రయాణంలోనే ప్రమాదానికి గురై.. సముద్రం పాలైన అత్యంత భారీ, విలాసవంతమైన నౌక. ఆ దుర్ఘటన జరిగిన రోజు 1912 ఏప్రిల్ 15. ఈ ప్రమాదంలో ఏకంగా 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో.. అట్లాంటిక్ సముద్రం దిగువన 3,800 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ షిప్ శిథిలాలను 1985లో గుర్తించారు. అంటే నౌక శిథిలాలను కనిపెట్టడానికే 72 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. ఆ నౌక శిథిలాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలని చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. వారికోసం ఓషన్ గేట్ అనే సంస్థ టూరిజం ప్రారంభించింది. సబ్‌మెరైన్ ద్వారా.. యాత్రికులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఈ సాహస యాత్ర టికెట్ 2 కోట్ల రూపాయలకు పైమాటే. అత్యంత కాస్ట్లీ టూర్ అయినప్పటికీ అడ్వెంచర్ ప్రియులు అలా సముద్రం అడుగుకి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూసి.. ప్రత్యేక అనుభూతి పొందేవాళ్లు. బ్రిటన్‌కు చెందిన బిలియనీర్ హమీష్ హార్డింగ్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు.. ఇద్దరు సిబ్బందితో ఓషన్ గేట్ సబ్‌మెరైన్ బయలుదేరింది. కానీ సముద్రం లోపలికి వెళ్లిన తర్వాత సబ్‌మెరైన్‌లో ఏదో ట్రబుల్ వచ్చింది. సిగ్నల్ పూర్తి కట్ అయింది. దాని కోసం ఇప్పుడు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంతో అమెరికా, కెనడా రక్షణ బృందాలు అప్రమత్తమయ్యాయి. 22 అడుగుల పొడవున్న ఆ మినీ జలాంతర్గామి ఆచూకీ కనుగొనేందుకు రెండు దేశాల కోస్ట్‌గార్డ్ బృందాలు కొన్ని వందల చదరపు కిలోమీటర్లలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవిడిచారు.
యాత్రను మొదలుపెట్టిన గంటా 45 నిముషాల్లోనే ఆ సబ్‌మెరైన్ కమ్యూనికేషన్ కోల్పోయిందని అమెరికా కోస్ట్‌గార్డ్ బృందం స్పష్టం చేసింది. ఆ జలాంతర్గామిలో ఇంకా 72 గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు సమాచారం. 10,432 కిలోల బరువున్న జలాంతర్గామి 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. తప్పిపోయిన సబ్‌మెరైన్ కోసం.. అట్లాంటిక్ మహాసముద్ర జలాలను జల్లెడ పడుతున్నారు. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలోకి దించారు. వాణిజ్య నౌకలను కూడా సెర్చ్ ఆపరేషన్ కోసం వినియోగిస్తున్నారు. రోజువారీ జీవితం నుంచి బయటికి వచ్చి, ప్రపంచంలో అసాధారణమైన విషయాలను చూడాలనుకునే వారు ఇలాంటి అడ్వెంచర్ యాత్రలు చేస్తుంటారు. స్పేస్‌లోకి వెళ్లిరావడం… సముద్ర గర్భంలో వింతలు విశేషాలను చూడటం ఎంతో మందికి లైఫ్ టైమ్ డ్రీమ్. ఇప్పటికే పలువురు.. సముద్ర గర్భంలోకి తిరిగివచ్చారు. కానీ ఇప్పుడు వెళ్లిన సబ్‌మెరైన్ ఏమైందో అర్ధం కావడం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..