China: క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఆంక్షలు తొలగించిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రం..

|

Dec 11, 2022 | 8:14 PM

కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అధికారులు కరోనా ఆంక్షలు సడలించినప్పటి నుంచి కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాధారణ...

China: క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఆంక్షలు తొలగించిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రం..
China Coronavirus
Follow us on

కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అధికారులు కరోనా ఆంక్షలు సడలించినప్పటి నుంచి కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాధారణ కరోనా పరీక్షలు రద్దు చేశాక ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా బీజింగ్ లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. వ్యాధి సోకిన వారు గృహ నిర్బంధలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే చైనాలో విస్తరిస్తున్న వైరస్ లో ఓమిక్రాన్‌ వేరియంట్ కేసులు అధికంగా ఉండటం అక్కడి ప్రజలను, అధికారులను, వైద్యులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రధాన నగరాల్లో సుమారు 10 వేల మందికి పైగా ప్రజలకు ఈ వేరియంట్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్య కార్యకర్తలు నివాసితులకు సాధారణ కరోనా పరీక్షలు నిర్వహించడం ఆపేసిన తర్వాత కొత్త కేసులకు సంబంధించిన అధికారిక లెక్కల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. బీజింగ్‌లో అత్యధిక జనాభ కలిగిన చాయోయాంగ్‌లోని మాల్స్‌లో పలు దుకాణాలు మూతబడ్డాయి. ప్రజల రాకపోకలు తగ్గిపోవడంతో పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.

ప్రస్తుతం చైనాలో పరిస్థితులు గాడి తప్పడంతో ఉద్యోగ వ్యాపారాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో చైనా ఆర్థిక పరిస్థితి మందగమనంలో పడింది. కొన్ని రోజుల క్రితం వరకు అమలు చేసిన జీరో కోవిడ్‌ ఆంక్షలతో వ్యక్తిగత ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలోనే మళ్లీ కరోనా విజృంభిస్తుండటం, కేసులు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వ్యక్తిగత ఆదాయాలు మరింత ఘోరంగా ఉంటాయని ఆర్థికవేత్త మార్క్‌ విలియమ్స్‌ చెబుతున్నారు.

కాగా.. కరోనా కేసులను తగ్గించుకునేందుకు, వ్యాప్తిని నియంత్రించేందుకు డ్రాగన్ కంట్రీ చేపట్టిన జీరో కొవిడ్ వ్యూహంపై పౌరుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. వ్యాధి సోకిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించడం, కుటుంబ సభ్యులను కలవనివ్వకపోవడం వంటి కఠిన నియమాలతో చైనీయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఆంక్షలను సడలించాలని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ పాలసీతో అంతకుమించిన ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రజల ఆందోళనలతో చైనా ప్రభుత్వం దిగొచ్చింది. జీరో కొవిడ్ పాలసీలోని చాలా ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా కొద్ది కొద్దిగా సడలిస్తూ.. చివరకు వైరస్ ను అంతమొందించడానికి బదులుగా, మిగతా ప్రపంచం మాదిరిగా వైరస్ తో సహజీవనానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతండటం ఆందోళనలకు కారణమవుతోంది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి