
న్యూ ఇయర్ వేళ జర్మనీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. మాగ్దబర్గ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ తెలుగు విద్యార్థి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు.. భవనంపై నుంచి దూకేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా, చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం 2023లో జర్మనీకి వెళ్లారు. మాగ్దబర్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని నివాసం ఉంటూ చదువుకుంటున్నాడు.
అయితే ఇటీవల న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అతడు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాం జరిగింది. కింది అంతస్తులో మంటలు చెలరేగడంతో.. ఆవి పైకి వ్యాపిస్తాయనే భయంతో.. తప్పించుకునేందుకు హృతిక్ రెడ్డి ప్రయత్నించాడు. అక్కడ దట్టమైన పొగలు అలుముకోవడంతో ఏం చేయాలో అర్థంకాక మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన అధికారులు అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చేందుకు హృతిక్ ప్లాన్ చేస్తున్నాడని.. ఇంతలోనే ఈ ప్రమాదంలో అతను మరణించడం చాలా బాధకరమని అక్కడే ఉంటున్న మరో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి తెలిపారు.
తనకు ఈ విషయం తెలిసిన వెంటనే హృతిక్ కుటుంబ సభ్యులకు తెలిపినట్టు అతను చెప్పుకొచ్చాడు. విషయం తెలుసుకున్న హృతిక్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పండుగకు ఇంటికి వస్తానని చెప్పిన కుమారుడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. హృతిక్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.