ఈ సృష్టిలో దేనికైనా ప్రత్యామ్నాయం దొరుకుతుంది కానీ అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం దొరకదు. అందుకే పెళ్లి లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆకాశమంత ప్రేమను చూపే అమ్మ తమ పక్కన లేకపోతే ఆ బాధ వర్ణాణాతీతం. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది. నెటిజన్లు బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. ఈ వీడియోలో ఓ వధువు తన తండ్రి చేతిని పట్టుకుని వివాహ వేదిక దగ్గరకు నడచుకుంటూ వస్తుంది. ఆ సమయంలో ఆమె చేతిలో ఓ ఫొటో ఉంది. అది ఆమె తల్లిది. ఆమె తల్లి చనిపోయింది. అయితే ఆ వధువు తన తల్లిదండ్రుల సమక్షంలోనే పెళ్లిపీటలెక్కాలనుకుంది. అందుకే తల్లి తనతో లేకపోయినా ఆమె ఫొటోని వెంట తెచ్చుకుంది. తద్వారా తల్లి తన వెంటే ఉన్నట్లు భావించింది. అయితే వేదిక దగ్గరకు వస్తున్న సమయంలో… బంధువులను చూసి.. పెళ్లికూతరు తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన ఆమె తండ్రి కూడా కన్నీరు పెట్టుకుంటారు.
మా అమ్మ గుర్తొచ్చింది..!
తండ్రీ కూతుళ్లే కాదు వారిని చూసిన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులందరూ భావోద్వేగానికి గురవుతారు. ఇంతలోనే వధువుకు కాబోయే అత్త వచ్చి ఆమెను దగ్గరకు తీసుకొని ఓదారుస్తుంది. ఇస్లామాబాద్‌కి చెందిన ఫొటోగ్రాఫర్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటివరకు కొన్ని మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఈ సందర్భంగా వీడియో చూసిన నెటిజన్లు కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఈ వీడియోను చూసి నేను ఏడ్చేశాను. నాకు కూడా అమ్మ లేదు. అల్లా ఆమెను ఆశీర్వదించాలి’ అని ఓ నెటిజన్ స్పందించగా ‘నేనూ కూడా నా వివాహ సమయంలో తల్లి ప్రేమను మిస్ అయ్యాను. ఈ వీడియో చూసినప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది. నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను’, ‘ఈ సృష్టిలో తల్లి ప్రేమకు సాటిలేదు’ అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. మరి ఎంతో అద్భుతంగా, ఎమోషనల్‌గా ఉన్న ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Viral Video: మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్.. డెయిరీ కంపెనీ ప్రమోషనల్ వీడియోపై వివాదం..