Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లు తమ వీరంగాన్ని కొనసాగిస్తున్నారు. ఒక పక్క ప్రపంచానికి తాము శాంతిని కోరుతున్నట్టు ప్రకటనలు గుప్పిస్తూనే మరో పక్క అక్కడ ఆత్మ దౌర్జన్య కాండ కొనసాగిస్తున్నారు. తాజాగా భారత్ తమతో దౌత్య సంబంధాలు కొనసాగించాలని కోరిన కొన్ని గంటల్లోనే ఆఫ్ఘనిస్తాన్ లోని భారత కాన్సులేట్లపై దాడులకు తెగబడ్డారు. కాందహార్, హీరత్ నగరాల్లో ఉన్న భారతీయ దౌత్యకార్యాలు ముట్టడించిన తాలిబన్ సేనలు.. అక్కడ తమ దుష్ట దౌర్జన్యాన్ని ప్రదర్శించాయి. ఆ కార్యాలయాల్లో ఉన్న పేపర్లు, పార్క్ చేసిన కార్లను తాలిబన్లు తీసుకువెళ్లారు. ఆ ప్రాంతాల్లో ప్రతి గడపనూ అడుగడుగునా తనిఖీలు చేస్తున్న తాలిబన్లు భారత ఎంబసీలనూ వదల్లేదు. భారత కాన్సులేట్లపై దాడులు చేసి లూటీ చేశారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్‌కు నాలుగు దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా కాబూల్‌లో అదనంగా మరో ఎంబసీ ఉంది. కాందహార్, హీరత్, మజార్ యే షరీఫ్ లో భారతీయ కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి. తాలిబన్ మిలిటెంట్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొన్ని రోజుల ముందే మజార్ యే షరీఫ్ కాన్సులేట్‌ను మూసివేశారు. కాగా, మూడు రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి సుమారు 200 మంది దౌత్య సిబ్బందిని తరలించినట్లు రాయబారి రుద్రేంద్ర టండన్ వెల్లడించారు.
ఐఎస్ఐ సూచనలతోనే..
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సూచనల మేరకే భారత ఎంబసీలో తాలిబన్లు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్, హీరత్ నగరాల్లోని ఎంబసీలో రెండురోజుఅల్ క్రితమే తాలిబన్లు సోదాలు నిర్వహించారు. తాజాగా.. మళ్ళీ సోదాలు నిర్వహించి.. అక్కడి కార్లు.. పత్రాలు ఎత్తుకుపోయారు. ఐఎస్ఐ అక్కడ దొరికిన పత్రాల ద్వారా భారత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
వణికిపోతున్న సాధారణ ప్రజలు..
మరోవైపు ఆఫ్గనిస్తాన్‌లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. తాలిబన్ల అరాచకాలు తట్టుకోలేమంటూ దేశ ప్రజలు భయంతో హడిలిపోతున్నారు. అవకాశం ఉంటే దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలతో నిండిపోయింది. తమను కాపాడండి అంటూ విదేశీ సిబ్బందిని వేడుకుంటున్నారు. తమను కాకపోయినా.. తమ పిల్లలను అయినా తీసుకెళ్లండి అంటూ ప్రాధేయపడుతున్నారు. ఇలాంటి బాధాకరమైన ఘటనలు కాబుల్ ఎయిర్ పోర్టులో దర్శనమిస్తున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్టులో పరిస్థితిని గమనిస్తే.. తాలిబన్లు అంటే ఏ రేంజ్‌లో వణుకు ఉంటుందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.
కాబూల్ ఎయిర్‌పోర్ట్ గోడకు అటువైపు బ్రిటన్, అమెరికా సహా ఇతర దేశాల సిబ్బంది, సైన్యం ఉన్నారు. ఇటువైపు ఆఫ్గన్ మహిళలు, ప్రజలు ఉన్నారు. తాలిబన్ల అరాచకాలను తట్టుకోలేమని, తమను రక్షించాలని విదేశీ సైన్యాన్ని వారు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాలిబన్ల పాలనలో ఆడపిల్లలకు రక్షణ ఉండదని, చిన్న పిల్లలను తమ వెంటనే తీసుకెళ్లిపోవాలంటూ ఆఫ్గన్ మహిళలు ఇతర దేశాల సైన్యాన్ని వేడుకుంటున్నారు.
Also Read: Afghanistan Crisis: ఆప్ఘన్‌లో మళ్లీ కాలకేయుల రాజ్యం.. భారత్ మౌనం వెనుక కారణాలు
Afghanistan Crisis: ఆఫ్ఘన్ పరిణామాలపై భారత్ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది?