‘హోర్ముజ్ జలసంధి అమెరికా భూభాగంలోదే..’ ట్రంప్ అంకుల్ మాటలకు అంతా షాక్‌!

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా తాను భావిస్తున్నానని ఆయన పేర్కొనడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది..

హోర్ముజ్ జలసంధి అమెరికా భూభాగంలోదే.. ట్రంప్ అంకుల్ మాటలకు అంతా షాక్‌!
Trump Says US Has Full Control of Hormuz

Updated on: Aug 22, 2026 | 10:51 AM

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా తాను భావిస్తున్నానని ఆయన పేర్కొనడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దక్షిణ కరోలినాలోని మైర్టిల్ బీచ్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రస్తుత ఘర్షణకు ముగింపు పలికేందుకు ఒప్పందం చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. అయితే అమెరికాకు ఇప్పటికీ అలాంటి ఒప్పందం అవసరమా లేదా అనే విషయాన్ని తాము నిర్ణయించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం హోర్ముజ్ జలసంధిపై మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను దీనిని అమెరికా భూభాగంగా చూస్తున్నాను. ఇది అమెరికా భూభాగమే’ అని చెప్పడం విశేషం.

ఇరాన్ సైనిక దిగ్బంధం కారణంగా హోర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ఆందోళనలు పెరిగాయి. చమురు ధరలు పెరగడం వల్ల పలు దేశాల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్‌ఎన్‌జీ (LNG)లో దాదాపు ఐదో వంతు హోర్ముజ్ జలసంధి మీదుగానే రవాణా అయ్యేది. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌లు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు మొదలవడంతో తీవ్ర అంతరాయం జరుగుతోంది. ట్రంప్ హోర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని మైర్టిల్ బీచ్‌కు బయలుదేరే ముందు కూడా చెప్పారు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం మనకు పూర్తి నియంత్రణ ఉంది. హోర్ముజ్ జలసంధికి సంబంధించిన మొత్తం ప్రాంతాన్ని పరిశీలిస్తే మనకు పూర్తి నియంత్రణ ఉందంటూ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై అమెరికా వైఖరి అత్యంగా వ్యూహాత్మకంగా ఉన్నట్లు ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఇరాన్‌పై కొత్త ఆర్థిక ఆంక్షలను ప్రకటించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్‌తో కీలకంగా వాణిజ్యం చేస్తున్న దేశాలపైనా, ముఖ్యంగా చైనాపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2025లో ఇరాన్ సముద్ర మార్గం ద్వారా ఎగుమతి చేసిన చమురులో 80 శాతానికి పైగా చైనాకే వెళ్లినట్లు కేప్లర్‌ సంస్థ డేటా వెల్లడించింది. దీంతో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆగస్ట్‌ 24 న (సోమవారం) మరిన్ని కొత్త ఆంక్షలను విధించేందుకు సమాయాత్తమవుతోంది. వీటిని అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలుగా అభివర్ణిస్తోంది. హోర్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న ప్రస్తుత ఉద్రిక్తతలు, ఇరాన్‌పై కొత్త ఆంక్షలు, చమురు రవాణాలో ఏర్పడుతున్న అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us