యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఓ అరడజను దొంగలకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.. దాంతో పాటు ఒకటిన్నర దిర్హామ్‌ల ఫైన్ కూడా విధించింది.. మూడేళ్ల జైలు శిక్ష నుంచి బయటకు వచ్చాక దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు చెప్పింది.. ఇంతకీ ఆ దొంగలెత్తుకెళ్లింది ఏ బంగారమో.. డబ్బో కాదు.. ఫేస్ మాస్క్‌లు.. కరోనా కాలంలో ఇప్పుడవే కదా విలువైనవి! దుబాయ్‌లో ఉద్యోగం సద్యోగం లేని ఓ ఆరుగురు పాకిస్తానీయులు కలిసి ఆల్ రషిడియాలోని ఒక వేర్‌హౌజ్‌లోకి చొరబడ్డారు.. అక్కడ 1.5 లక్షల దిర్హామ్.. మన కరెన్సీలో చెప్పాలంటే ఇంచుమించు 30 లక్షల రూపాయలు విలువ చేసే 156 బాక్సుల ఫేస్ మాస్క్‌లను ఎత్తుకెళ్లారు.. ఫేస్‌మాస్క్‌లు చోరీకి గురయ్యాయని తెలుసుకున్న చైనా ఉద్యోగి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఈ దొంగతనం జరిగింది అయిదు నెలల కిందట! కంప్లయింట్ అందుకున్న పోలీసులు కొద్ది రోజుల్లోనే ఆ అరడజను దొంగలను అరెస్ట్ చేశారు.. ఎత్తుకెళ్లిన మాస్క్‌లను బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి అమ్మేశారట! ఇంతకు ముందు కూడా చాలాసార్లు దొంగతనాలు చేశారట! ఈ విషయాన్ని వారే ఒప్పుకున్నారు..