టర్కీ, సిరియాలో సంభవించిన పెను భూకంపం.. అంతులేని విషాదాన్ని మిగుల్చుతోంది. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా ఎంతో మంది చిక్కుకున్నారు. భవనాల వ్యర్థాలు తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతాయన్న అధికారుల ప్రకటనలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇదంతా ఓ వైపు అయితే.. మరోవైపు.. అయిన వారిని కోల్పోయి అనాథలుగా మిగిలిన వారు, తమ వారు ఏమయ్యారోననే జాడ తెలియక తల్లడిల్లిపోతున్నారు. పెను విపత్తు వేల మందిని బలి తీసుకుంది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఎటుచూసినా విషాదం, ఎవరిని కదిపినా కన్నీళ్లే. అయిన వాళ్లను కోల్పోయిన వారి ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. ఆ ప్రదేశాల్లో కొన్ని దృశ్యాలైతే హృదయాలను కదిలించివేస్తున్నాయి.
శిధిలాల కిందే చావు పుట్టుకలు అన్నట్లు ఓ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆ శిధిలాల్లోనే కలిసిపోయింది. ఎటు చూసినా ఇలాంటి హృదయవిదారక ఘటనలే దర్శనమిస్తున్నాయి. తాజాగా మరో ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథాలల కింద 10 ఏళ్ల లోపు వయసున్న అక్కా తమ్ముడు ఇరుక్కున్నారు. భవనం స్లాబ్ విరిగి వాళ్లపై పడింది. అయితే అదృష్టం కొద్ది స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్ సపోర్టు కావడంతో దానికింద వాళ్లు నలిగిపోకుండా ప్రాణాలతో ఉన్నారు.
కాగా, అంతటి భయకరమైన పరిస్థితుల్లోనూ ఆ బాలిక తన తమ్ముడి ప్రాణాలకోసం ఆరాటపడింది. విరిగిన స్లాబ్ ఇంకేమాత్రం కిందకి జారినా ఇద్దరి ప్రాణాలూ దక్కని పరిస్థితి. అయితే తన తమ్ముడిని కాపాడుకోడానికి ఆ చిన్నారి తలకు తన చిట్టి చేయిని అడ్డుపెట్టింది ఆ బాలిక. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ప్రేమ శిథిలాల కింద చిక్కుకున్నదా అనిపిస్తుంది. అయితే నిద్రలో ఉండగా స్లాబ్ విరిగి మీద పడటంతో చిన్నారులిద్దరూ ప్రాణాలు బిగబట్టుకుని రక్షించే వారి కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..