
బిష్కెక్: ఉగ్రవాదంపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) 26వ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై గట్టి సందేశం ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి నిధులు అందించడం, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం, నియామకాలు చేపట్టడం, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి మొత్తం వ్యవస్థను కూల్చివేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తదితర దేశాల అధినేతలు హాజరయ్యారు. అయితే మోదీ తన ప్రసంగంలో పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇచ్చే దేశాలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని అన్నారు.
ఉగ్రవాదం వ్యూహాత్మక ఆయుధం కాదు: మోదీ
ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆస్తిగా మారకూడదని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో అన్ని దేశాలు ఒకే వైఖరితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరిపోదని.. వారి వెనుక ఉన్న నిధులు, నియామకాలు, తీవ్రవాద భావజాలం, సురక్షిత స్థావరాల వ్యవస్థను కూడా పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని చెప్పారు.
యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లేదు: ప్రధాని
ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, ఘర్షణలపైనా మోదీ స్పందించారు. యుద్ధభూమిలో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని అన్నారు. అన్ని వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఒక ప్రాంతంలో మొదలైన యుద్ధం ఇప్పుడు ఆ ప్రాంతానికే పరిమితం కావడం లేదని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ సౌత్ దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయని చెప్పారు.
డ్రగ్స్‌పైనా ప్రధాని మోదీ హెచ్చరిక
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కూడా తీవ్రమైన సమస్యగా మారుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేవలం నేరం మాత్రమే కాదని.. అవి యువత భవిష్యత్తుతో పాటు ప్రాంతీయ భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు SCO దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమని చెప్పారు. భద్రత, సమాచార భద్రత, డ్రగ్స్ వంటి అంశాలపై SCO ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
కనెక్టివిటీకి భారత్ మద్దతు.. కానీ ఒక షరతు: మోదీ
SCO దేశాల మధ్య వాణిజ్యం, రవాణా, అనుసంధానం పెరగాలని భారత్ కోరుకుంటోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. మార్కెట్లను కలపడం, వాణిజ్యాన్ని సులభతరం చేయడం, కొత్త అభివృద్ధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే కనెక్టివిటీ పేరుతో చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా ప్రతి దేశం సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. రోడ్లు, రైల్వేలు, విమాన మార్గాలతో పాటు కస్టమ్స్ ప్రక్రియలను సులభతరం చేయడం, డిజిటల్ డాక్యుమెంటేషన్, మెరుగైన లాజిస్టిక్స్‌పై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రజలకు నేరుగా ప్రయోజనం ఉండాలి: ప్రధాని
SCO సహకారం వల్ల సాధారణ ప్రజలకు నేరుగా ప్రయోజనం కలగాలని మోదీ అన్నారు. యువత, రైతులు, పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు రావాలని చెప్పారు. భారత్‌కు SCO అంటే కేవలం భద్రత, వాణిజ్య సహకార వేదిక మాత్రమే కాదని.. వివిధ నాగరికతలు, సంస్కృతులు, ఆలోచనలు కలిసే వేదిక అని అభివర్ణించారు. రాబోయే సంవత్సరాల్లో ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.
పుతిన్‌తో భేటీ.. షీతో పలకరింపు
SCO సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తోనూ చర్చలు జరిపారు. ప్రాంతీయ పరిణామాలు, భద్రత, వాణిజ్యం, ఇతర ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇక ఈ సదస్సు సందర్భంగా జరిగిన గ్రూప్ ఫొటోలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటం, పలకరించడం కనిపించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అక్కడే ఉన్నప్పటికీ.. మోదీ, షరీఫ్ మధ్య ప్రత్యేకంగా సమావేశం జరగలేదు. కనీసం కంటి చూపునకు కూడా నోచుకోలేకపోవడం విశేషం.
మొత్తంగా బిష్కెక్ SCO వేదికగా మోదీ ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది. ఉగ్రవాదంపై ఎలాంటి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు.. ఉగ్రవాదానికి నిధులు, ఆశ్రయం, మద్దతు ఇచ్చే మొత్తం వ్యవస్థను కూల్చేయాలి అని భారత్ మరోసారి తేల్చి చెప్పింది. అదే సమయంలో యుద్ధాలకు బదులు చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH किर्गिस्तान: प्रधानमंत्री नरेंद्र मोदी ने बिश्केक में 26वें शंघाई कोऑपरेशन ऑर्गनाइज़ेशन (SCO) समिट में चीनी राष्ट्रपति शी जिनपिंग और रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन से मुलाकात की।
(सोर्स: होस्ट ब्रॉडकास्टर वाया रॉयटर्स) pic.twitter.com/HgC52HZcoK
— ANI_HindiNews (@AHindinews) September 1, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..