Russia-Ukraine war Effect: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం.. కేవలం ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను(Economies) మాత్రమే ప్రభావితం చేయటం లేదు. దాని కారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం(Inflation) ప్రపంచ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన ధరలకు అదనంగా.. ప్రస్తుతం పెరుగుతున్న ముడి చమురు ధరలు పుండు మీద కారం చల్లినట్లుగా మారాయి. యుద్ధం కారణంగా వివిధ దేశాలు రష్యాపై విధించిన తాజా ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తో సహా అన్ని దేశాలు ప్రస్తుతం ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నాయి. అసలు భారత్- రష్యాలు ఒకదానిపై మరొకటి ఎంతగా ఆధారపడి ఉన్నాయో ఒక సారి మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారత్-రష్యాలు రూ. 67,500 కోట్లు విలువైన వాణిజ్యాన్ని చేశాయి. ఇది గత ఏడాది సుమారు 60 వేల కోట్ల రూపాయలు ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఎక్కువగా రక్షణ ఆయుధాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు, పప్పులు, మందులు, వాహనాలు తదితర రంగాల్లో వ్యాపారాలు చేసేవి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్.. రష్యా నుంచి సుమారు రూ. 64 వేల కోట్లు విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇందులో ఎక్కువ భాగం అంటే సుమారు రూ. 34 వేల కోట్లు విలువైన పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి.
ప్రస్తుత యుద్ధం ప్రభావం దేశంలోని రైతులపై కూడా కనిపిస్తోంది. ఎరువుల కోసం భారత్ ఎక్కువగా రష్యాపైనే ఆధారపడుతూ ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఎరువుల సరఫరా కొనసాగేలా చూసేందుకు రష్యాతో భారత్ చర్చలు జరుపుతోంది. 2020లో రష్యా నుంచి 650 మిలియన్ డాలర్ల విలువైన ఎరువులను భారత్ దిగుమతి చేసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రష్యాకు 1685 కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో ప్రధానంగా బియ్యం, ద్రాక్ష, గ్వార్ గమ్, బీఫ్ తో పాటు కూరగాయలు ఉన్నాయి. ఇదే సమయంలో భారతదేశం.. రష్యా నుంచి రూ. 241 కోట్లు విలువైన వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతుల్లో అగ్రభాగం పప్పు ధాన్యాలు ఉన్నాయి.
యుద్ధం ప్రారంభం కాకముందే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. దీని కారణంగా సామాన్యుల జేబుకు ఎక్కువగా చిల్లు పడుతోంది. దీనికి తోడు రానున్న రోజుల్లో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశీయ ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగం రష్యా నుంచి వస్తోంది. అంతేకాక భారత్ కు చెందిన ఆయిల్ కంపెనీలు.. రష్యాలోని చమురు, గ్యాస్ క్షేత్రాల్లో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టాయి. ONGC విదేశ్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, భారత్ పెట్రోసోర్సెస్ లిమిటెడ్ రష్యాలోని వివిధ చమురు గ్యాస్ ప్రాజెక్టుల్లో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి.
కానీ రెండు దేశాల మధ్య కీలకంగా నిలుస్తున్నది మాత్రం రక్షణ రంగమని చెప్పుకోవాలి. భారత్ తన రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, పరికరాలు, సాంకేతికత అవసరాల కోసం ఎక్కువగా రష్యాపై ఆధారపడి ఉంది. ఇటీవల మనదేశం రష్యా నుంచి S-400 ట్రంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేసేందుకు 42 వేల కోట్ల రూపాయల డీల్ ను కుదుర్చుకుంది. మొత్తం మీద ఈ యుద్ధం ప్రభావం వ్యవసాయం నుంచి రక్షణ, ఇంధనం నుంచి ఔషధాల వరకు అన్ని రంగాలపై కనిపిస్తోంది. అయితే భారత్- రష్యాల మధ్య చెల్లింపుల కోసం రూపాయి-రూబుల్ ఏర్పాటు చేసుకున్న కారణంగా.. పశ్చిమదేశాలతో పోల్చితే ఆంక్షల ప్రభావం భారత్ విషయంలో పరిమితంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read..