రష్యా – ఉక్రెయిన్ (Russia – Ukraine) మధ్య యుద్ధం ప్రారంభమై నెలలు గడుస్తున్నా రోజురోజుకు తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) హెచ్చరికలు చేశారు. వీలైనంత త్వరగా తమ నిబంధనలను అంగీకరించాలని చెప్పారు. లేనిపక్షంలో మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు జరిగింది ట్రయల్ మాత్రమేననీ.. యుద్ధభూమిలో మాస్కో సేనలు ఇంకా తమ అసలైన చర్యను ప్రారంభించనే లేదని చెప్పడం గమనార్హం. అంతే కాకుండా పశ్చిమ దేశాలు తమ శత్రుత్వానికి మరింత ఆజ్యం పోస్తున్నాయిని పుతిన్ ఆరోపించారు. యుద్ధం ముగింపు కోసం తాను చర్చలు జరిపేందుకు సిద్ధమేనని వెల్లడించారు. ఈ ప్రక్రియ ఎంత ఆలస్యమైతే తమతో ఒప్పందం చేసుకోవడం కూడా అంతే కష్టమవుతుందని హెచ్చరించారు.
కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టాయి. ఇరు దేశాల మధ్య దాదాపు నాలుగున్నర నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ లో అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభం ఇదే. డాన్‌బాస్ ప్రాంత విముక్తి కోసం ప్రత్యేక సైనిక చర్య ప్రారంభించామని చెప్పిన పుతిన్ ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరినట్లు ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ కూడా తమ బలగాలు చేజిక్కిందని, డాన్‌బాస్ ప్రాంతంలోని కీలక ప్రాతాలన్నింటిపైనా తాము పట్టు సాధించామని వెల్లడించారు.
విరామం లేకుండా కొనసాగుతున్న దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దానివల్ల మానసికంగానూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కుటుంబాలకు దూరంగా ఉండడం, వారి క్షేమ సమాచారం గురించి ఉన్న ఆందోళన యుద్ధం చేసే సైనికులుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆయుధాల పరంగా తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న రష్యాతో గట్టిగా పోరాడుతూ దేశం కోసం కట్టుబడి ఉన్న సైనికుల పోరాట పటిమను మెచ్చుకోవాల్సిందే.