
భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలో అత్యంత కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానిగా నిలవడంపై స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఘనతను ఆయన రాజకీయ అద్భుతంగా అభివర్ణించారు. సోమవారం బ్రాటిస్లావాలో ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాల (ఎంఓయూలు) మార్పిడి కార్యక్రమం, సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన ఫికో.. మోదీ నాయకత్వం, ప్రజాదరణను కొనియాడారు. “భారతదేశంలో అత్యంత కాలం ప్రధానిగా కొనసాగుతున్నందుకు ప్రధాని మోదీకి అభినందనలు. ఇది నిజంగా ఒక రాజకీయ అద్భుతం అని ఫికో వ్యాఖ్యానించారు.
జూన్ 10న ప్రధాని మోదీ 4,399 రోజుల నిరంతర పదవీకాలాన్ని పూర్తి చేసి, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నెలకొల్పిన 4,398 రోజుల రికార్డును అధిగమించారు. దీంతో భారత రాజకీయ చరిత్రలో అత్యంత కాలం నిరంతరాయంగా ఎన్నికై అధికారంలో కొనసాగిన ప్రధానిగా మోదీ కొత్త చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, విదేశీ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.
#WATCH | Bratislava | Prime Minister of Slovakia, Robert Fico, says, "Mr Prime Minister, I congratulate you on being the longest serving PM in India. This is like a political miracle." pic.twitter.com/4KRXXEW9QX
— ANI (@ANI) June 15, 2026
భారత్ ఆర్థిక రంగంలో సాధిస్తున్న వేగవంతమైన ప్రగతి, డిజిటల్ విప్లవం, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సాధించిన విజయాలను కూడా స్లోవాక్ ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనేక కీలక రంగాల్లో భారత్ అభివృద్ధి చెందిన దేశాలను సైతం అధిగమించిందని ఆయన పేర్కొన్నారు.
“స్లోవేకియా, భారత్‌ల మధ్య అనేక ఉమ్మడి అంశాలు ఉన్నాయి. భారత్ సాధిస్తున్న అద్భుత ఫలితాలకు నా అభినందనలు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మాత్రమే కాదు, ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే సామర్థ్యం కలిగి ఉంది” అని ఫికో అన్నారు.
ప్రధాని మోదీ ప్రస్తుతం యూరప్ పర్యటనలో భాగంగా స్లోవేకియాను సందర్శిస్తున్నారు. భారత ప్రధానమంత్రి ఒకరు స్లోవేకియాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా బ్రాటిస్లావాలోని చారిత్రక కోటలో మోదీ, ఫికోల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అధికారిక సమావేశాలకు ముందు ఇరువురు నేతలు కళా ప్రదర్శనను కూడా సందర్శించారు.
మోదీకి బ్రాటిస్లావాలో ఘన స్వాగతం లభించింది. సైనిక గౌరవ వందనం మధ్య ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ చర్చల్లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తదితరులు భారత ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు.
భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టంగా నిలిచిన ఈ రికార్డు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వరుసగా మూడు సార్లు ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన మోదీ, ఇప్పుడు అత్యంత కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానిగా కొత్త మైలురాయిని చేరుకోవడం విశేషంగా మారింది.