PM Modi: ప్రధాని మోదీకి పవిత్ర బౌద్ధ గ్రంథం ప్రదానం.. థాయ్‌లాండ్‌ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం..

భూకంపంతో వణికిన థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆరో బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు మోదీ బ్యాంకాక్‌కు విచ్చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బ్యాంకాక్‌లో థాయ్‌ రామాయణాన్ని మోదీ తిలకించారు.

PM Modi: ప్రధాని మోదీకి పవిత్ర బౌద్ధ గ్రంథం ప్రదానం.. థాయ్‌లాండ్‌ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం..
PM Narendra Modi

Updated on: Apr 03, 2025 | 4:53 PM

భూకంపంతో వణికిన థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆరో బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు మోదీ బ్యాంకాక్‌కు విచ్చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బ్యాంకాక్‌లో థాయ్‌ రామాయణాన్ని మోదీ తిలకించారు. భారత్‌ -థాయ్‌లాండ్‌ మధ్య ఎన్నో శతాబ్ధాల అనుబంధం ఉందని , దీనికి రామాయణమే నిదర్శనమన్నారు మోదీ. రామాయణాన్ని ప్రదర్శించిన కళాకారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా థాయ్ ప్రధానమంత్రి “ది వరల్డ్ టిపిటక: సజ్ఝాయ ఫొనెటిక్ ఎడిషన్”ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక దౌత్యం ముఖ్యమైన భాగస్వామ్యానికి గుర్తుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. థాయ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్న్ షినవత్ర.. పవిత్ర గ్రంథం “ది వరల్డ్ టిపిటక: సజ్ఝాయ ఫొనెటిక్ ఎడిషన్”ను ప్రదానం చేశారు. టిపిటక (పాలీలో) లేదా త్రిపిటక (సంస్కృతంలో) అనేది 108 సంపుటాలతో కూడిన బుద్ధుని బోధనల సంకలనం.. ఇది ప్రధాన బౌద్ధ గ్రంథంగా పరిగణిస్తారు.

ప్రధాని మోదీకి బహుమానంగా అందించిన..  ది వరల్డ్ టిపిటక: సజ్ఝాయ ఫొనెటిక్ ఎడిషన్.. పాలీ, థాయ్ లిపిలలో వ్రాయబడిన జాగ్రత్తగా రూపొందించబడిన వెర్షన్.. ఇది తొమ్మిది మిలియన్లకు పైగా అక్షరాల ఖచ్చితమైన ఉచ్చారణను నిర్ధారిస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను 2016లో రాజు భూమిబోల్ అదుల్యదేజ్ (రామ IX), రాణి సిరికిట్ 70 సంవత్సరాల పాలనను స్మరించుకునేందుకు థాయ్ ప్రభుత్వం వరల్డ్ టిపిటక ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రచురించింది.

వీడియో చూడండి..

ప్రధానమంత్రి మోదీకి టిపిటకను సమర్పించడం భారతదేశం ఆధ్యాత్మిక నాయకత్వానికి, బౌద్ధ దేశాలతో దాని శాశ్వత బంధానికి నిదర్శనం. ప్రధాని మోదీ థాయిలాండ్ పర్యటన సందర్భంగా, ఆ దేశం 18వ శతాబ్దపు రామాయణ కుడ్యచిత్రాల ఆధారంగా ఒక ప్రత్యేక స్టాంపును విడుదల చేస్తుంది.

ఈ పర్యటనలో ప్రధాని మోదీ థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్‌టార్న్‌ షినవత్రాతో భేటీ అవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతోపాటు.. పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. సాయంత్రం బిమ్‌స్టెక్‌ సదస్సులో మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్‌ దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ఈ సదస్సులో సాంకేతిక, ఆర్థిక సహకారంపై చర్చించనున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..