PM Modi Mauritius Tour: ప్రధాని మోదీ మారిషస్ పర్యటన.. ఆ దేశాధ్యక్షుడికి ప్రత్యేక బహుమతులు

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మారిషస్ చేరుకున్నారు. అక్కడ ఆయన మారిషస్‌ అధ్యక్షుడు ధరమ్‌ గోకుల్‌కు భారత ప్రధాని మోదీ అరుదైన కానుక ఇచ్చారు. కుంభమేళా నుంచి తీసుకెళ్లిన పవిత్ర గంగాజలాన్ని అందించారు. ఆ వివరాలు..

PM Modi Mauritius Tour: ప్రధాని మోదీ మారిషస్ పర్యటన.. ఆ దేశాధ్యక్షుడికి ప్రత్యేక బహుమతులు
Pm Modi

Updated on: Mar 11, 2025 | 5:07 PM

రెండురోజుల పర్యటన కోసం మారిషస్‌ చేరుకున్నారు ప్రధాని మోదీ. ఆయన మారిషస్‌కు వెళ్లడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పోర్ట్‌ లూయిస్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అక్కడి మహిళలు సాంప్రదాయ బీహారీ భోజ్‌పురి సంగీతం ‘గీత్ గవాయ్’తో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. మారిషస్‌ జాతీయ దినోత్సవంలో పాల్గొనడానికి మోదీ మారిషస్‌కు చేరుకున్నారు. మారిషస్‌ ప్రధాని నవీన్‌ రాంగులామ్‌- మోదీని ఆహ్వానించారు. ప్రవాస భారతీయులను మోదీ కలుసుకున్నారు.

మంగళవారం మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో  సమావేశమయ్యారు మోదీ.. ఆయనకు పలు బహుమతులను ఇచ్చారు. మొదటిగా మారిషస్ అధ్యక్షుడికి మహాకుంభ్‌ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలాన్ని అందించారు. దీంతో పాటు పలు బహుమతులను కూడా అందజేశారు. అంతకముందు మారిషస్ ప్రధాని నవీన్‌ రామ్‌గోలంతో కలిసి సర్‌సీవూసాగర్ రామ్‌గులం బొటానికల్ గార్డెన్‌లో ఒక మొక్కను నాటారు ప్రధాని మోదీ. అలాగే బీహారీ సూపర్ ఫుడ్- ‘మఖనా’ను కూడా మారిషస్ అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చారు మోదీ. అనంతరం మారిషస్ దేశాధ్యక్షుడు ఇచ్చిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు.

మారిషస్ అధ్యక్షుడి భార్యకు బనారస్ శారీ బహుమతి..

దేశంలో ప్రసిద్ది గాంచిన, వారణాసిలో పుట్టిన బనారస్ చీరను మారిషస్ ఫస్ట్ లేడీ వ్రిందాకు బహుమతిగా ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బనారస్ చీరలు భారత సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. దాని చక్కటి పట్టు, సంక్లిష్టమైన బ్రోకేడ్‌లు, విలాసవంతమైన జరీ బోర్డర్ ప్రసిద్ధి గాంచాయి. ఈ అద్భుతమైన రాయల్ బ్లూ షేడ్‌లోని బనారస్ చీరను గుజరాత్‌లో దొరికే సడేలి పెట్టెలో పెట్టి బహుమతిగా ఇచ్చారు ప్రధాని మోదీ. సడేలి పెట్టెలు విలువైన చీరలు, నగలు లేదా స్మారక చిహ్నాలను పెట్టుకునేందుకు ఉపయోగిస్తుంటారు.