Pakistan: పాక్ పోలీస్ స్టేషన్‌లో ఆత్మాహుతి దాడి.. 13 మంది పోలీసులు మృతి , 50 మందికి గాయాలు

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మలాకాండ్ డివిజన్‌లోని స్వాత్ జిల్లాలోని కబాల్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌లో 2 పేలుళ్లు జరిగినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ తెలిపారు. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ భవనం మొత్తం కుప్పకూలింది.

Pakistan: పాక్ పోలీస్ స్టేషన్‌లో ఆత్మాహుతి దాడి.. 13 మంది పోలీసులు మృతి , 50 మందికి గాయాలు
Pak Terror Attack

Updated on: Apr 25, 2023 | 7:20 AM

తాను పెంచిన పోషించిన ఉగ్రవాదానికి తానే బలైపోతోంది దాయాది దేశం పాకిస్థాన్.. తాజాగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా లో భారీ ఉగ్రదాడి జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు మళ్లీ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం..  ఫిదాయీన్ ఉగ్రవాదులు పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించి తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దాడిలో 13 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మలాకాండ్ డివిజన్‌లోని స్వాత్ జిల్లాలోని కబాల్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌లో 2 పేలుళ్లు జరిగినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ తెలిపారు. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ భవనం మొత్తం కుప్పకూలింది. దీంతో ఘటన స్థలంతో పాటు.. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. జియో న్యూస్ నివేదిక ప్రకారం.. ఉగ్రవాదుల దాడిలో 12 మంది పోలీసులు మరణించారు. మరోవైపు భవనంలో పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో కరెంటు పోయిందని సీటీడీ డీఐజీ ఖలీద్ సోహైల్ తెలిపారు.

ఈ దాడిని పాకిస్థాన్ హోంమంత్రి రాణా సనావుల్లా ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ పేలుడులో మరణించిన వారి పట్ల విచారం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో ఈ ఉగ్రవాద శాపం త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని సనావుల్లా ఖాన్ అన్నారు.

గత కొన్ని నెలలుగా పాకిస్థాన్‌లో ఉగ్రవాద ఘటనలు ఎక్కువయ్యాయి. ఉగ్రవాదులు ఇక్కడ చట్టాన్ని అమలు చేసేవారిని టార్గెట్ చేస్తున్నారు. పాకిస్థాన్‌లోని భద్రతా సంస్థలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులపై ఆపరేషన్ ప్రారంభించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..