Pakistan New PM: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్‌ ఏకగ్రీవం.. నేషనల్ అసెంబ్లీ నుంచి PTI ఎంపీల వాకౌట్

పాకిస్తాన్ పార్లమెంట్ కొత్త ప్రధానమంత్రిగా షాబాజ్ షరీఫ్‌ను ఎన్నుకుంది. పాక్ నూతన ప్రధానిగా పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ (70) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Pakistan New PM: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్‌ ఏకగ్రీవం.. నేషనల్ అసెంబ్లీ నుంచి PTI ఎంపీల వాకౌట్
Pakistan PM Shehbaz Sharif (File Photo)
Image Credit source: TV9 Telugu

Updated on: Apr 11, 2022 | 6:20 PM

Pakistan New Prime Minister: పాకిస్తాన్ పార్లమెంట్ కొత్త ప్రధానమంత్రిగా షాబాజ్ షరీఫ్‌(Shehbaz Sharif)ను ఎన్నుకుంది. పాక్ నూతన ప్రధానిగా పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్‌ (70) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షాబాజ్‌కు పాకిస్తాన్‌ నేషనల్ అసెంబ్లీ(Pakistan National Assembly) నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. ఆయనకు అనుకూలంగా 174 ఓట్లు పోలయ్యాయి. ఈ విషయాన్ని స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఎంపీలు పార్లమెంట్‌లో ఓటింగ్‌ను బహిష్కరించారు. మరోవైపు పీటీఐ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న షా మెహమ్ముద్‌ ఖురేషీ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రధానమంత్రిగా షెహబాజ్‌కు మార్గం సుగమమైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు షాబాజ్ షరీఫ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షాబాజ్ పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రి అయ్యారు.

షాబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. పార్లమెంట్‌లో ఓటింగ్ జరుగుతున్న సమయంలో నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ కూడా ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్నారు. షాబాజ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత షాబాజ్ షరీఫ్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అవిశ్వాసంపై ఓటింగ్ జరగడం, ప్రధాని కుర్చీని కోల్పోవడం పాకిస్తాన్‌లో ఇదే తొలిసారి అని అన్నారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. అతను చట్టాన్ని సమర్థించాడు. సుప్రీంకోర్టు గట్టి సందేశం ఇచ్చింది. వారం రోజులుగా సాగుతున్న డ్రామా ముగిసింది. నవాజ్ షరీఫ్‌కు నేను సెల్యూట్ చేస్తున్నాను అని షాబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తానీయుల జీవితం అప్పుల జీవితం కాదన్నారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను షాబాజ్ తోసిపుచ్చారు. ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా ప్రకటనలపై పాకిస్తాన్‌ కొత్త ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ నేషనల్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ విషయంలో మా ప్రమేయం నిరూపితమైతే నేనే ఇక్కడికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని స్పష్టం చేశారు.


అంతకు ముందు పాకిస్తాన్‌ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ఇందుకు ఇతర పార్టీల సభ్యులందరూ హాజరైనప్పటికీ ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని ‘పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ సభ్యులు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పీటీఐ పార్టీ నేతలంతా మూకుమ్మడి రాజీనామా చేసి, ప్రధాని ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దొంగలతో కలిసి జాతీయ అసెంబ్లీలో కూర్చోలేమంటూ పీటీఐ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి చెందిన చాలా మంది పార్లమెంటేరియన్లు కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి ఓటింగ్‌కు ముందు నేషనల్ అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఆదివారం అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించారు. సభ విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత దేశ చరిత్రలో పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఖాన్ నిలిచారు. పాకిస్తాన్ 1947లో ఉనికిలోకి వచ్చినప్పటి నుండి అనేక పాలన మార్పులు, సైనిక తిరుగుబాట్లతో రాజకీయ అస్థిరతతో పోరాడుతోంది. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయలేదు.

ఇదిలాఉంటే, పాక్ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్‌ ఎన్నికయ్యే తరుణంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మనీ లాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షాబాజ్‌ షరీఫ్‌తోపాటు ఆయన కుమారుడికి పాకిస్తాన్‌ న్యాయస్థానంలో ఊరట లభించింది. న్యాయస్థానానికి హాజరుతోపాటు అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ను పొడగించిన న్యాయస్థానం.. ఈ కేసును ఏప్రిల్‌ 27కు వాయిదా వేసింది. దీంతో పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌కు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమయ్యింది.

Read Also….  AP Cabinet Ministers: పదవ తరగతి నుంచి పీహెచ్‌డీ దాకా.. ఏపీ కొత్త మంత్రులు ఎవరెవరు ఏం చదివారంటే!