న్యూజిలాండ్, సెప్టెంబర్ 6: సాధారణంగా డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో దూది, కత్తెర వంటివి కడుపులో మరిచిపోయి కుట్లు వేయడం మనం చాలా సార్లు విన్నాం. కానీ ఈ డాక్టర్ మాత్రం మతిమరుపులో గజినీని మించిపోయేలా ఉన్నాడు. ఆపరేషన్ చేసి మహిళ కడుపులో ఏకంగా కంచం మరచిపోయాడు. అదేంటి.. అని అనుకుంటున్నారా? అవునండీ.. ప్రసవం కోసం వెళ్లిన మహిళకు సిజేరియన్ చేసి బిడ్డను తీశాడు. ఆనక కుట్లు వేసే సమయంలో కడుపులో ఏకంగా పళ్లెం పెట్టి కుట్లు వేసేశాడు. ఈ విచిత్ర ఘటన న్యూజిలాండ్‌లో వెలుగు చూసింది.
న్యూజిలాండ్ హెల్త్ అండ్ డిసేబిలిటీ కమీషనర్ సోమవారం (సెప్టెంబర్ 4) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2020లో ఆక్లాండ్ సిటీ హాస్పిటల్‌కి ప్రసవ వేదనతో 20 యేళ్ల వయసున్న ఓ మహిళ వెళ్లింది. అక్కడి వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డకు పురుడుపోశారు. తల్లీబిడ్డ క్షమంగానే ఉన్నారు. ఐతే ఆపరేషన్ చేసే సమయంలో 17 సెంటీమీటర్ల (6 అంగుళాలు) అలెక్సిస్ రిట్రాక్టర్ (స్థూపాకార పరికరం) అనే పరికరాన్ని పెట్టి కుట్లు వేశారు. ఆ తర్వాత మహిళను డిశ్చార్జ్ చేసి పంపించేశారు. ఐతే ఆ తర్వాత మహిళకు తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేది. దీర్ఘకాలిక కడుపునొప్పితో బాధపడుతోన్న మహిళ వైద్యుల వద్దకు వెళ్లింది. వాళ్లు ఎక్స్‌రేతో సహా పలు పరీక్షలు చేశారు. ఎన్నో రకాల మందులు కూడా ఇచ్చారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి సీటీ స్కాన్‌లో అసలు విషయం బయటపడింది. మహిళ కడుపులో 18 నెలలుగా ఏడబ్ల్యూఆర్ అనే ముడుచుకునే స్థూపాకార పరికరం ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆమె కడుపులో ప్లేట్ పరిమాణంలో ఉన్న ఓ పరికరం ఉన్నట్లు డాక్టర్లు బాధిత మహిళకు తెలిపారు. దీంతో 18 నెలల క్రితం తనకు సిజేరియన్ జరిగిందని, ఆ తర్వాత తనకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదని డాక్టర్లకు తెల్పింది. ఐతే తనకు తరచుగా కడుపునొప్పి వచ్చేదని ఎందుకు వచ్చేదో తనకు తెలియదని చెప్పుకొచ్చింది. దీంతో డాక్టర్లు జరిగింది ఏమిటో ఊహించగలిగారు.
వెంటనే ఆపరేషన్ చేసి మహిళ కడుపులోని పరికరాన్ని బయటికి తీశారు. దానిని సిజేరియన్ చేసే సమయంలో డాక్టరు వినియోగించే పరికరాల్లో అలెక్సిస్ రిట్రాక్టర్ అనే పరికరంగా గుర్తించారు. అది చూడటానికి డిన్నర్ ప్లేట్ పరిమాణంలో ఉంది. ఈ సంఘటన 2021లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన నివేదిక సోమవారం విడుదలవగా న్యూజిలాండ్ హెల్త్ కమీషనర్ మోరాగ్ మెక్‌డోవెల్.. టె వాటు ఓరా ఆక్లాండ్, ఆక్లాండ్ డిస్ట్రిక్ట్ హెల్త్ బోర్డ్ రోగి హక్కుల నియమావళిని ఉల్లంఘించినట్లు వెల్లడించారు. మహిళకు సిజేరియన్ చేసే సమయంలో అశ్రద్ధ వహించినట్లు గుర్తించింది. బాధిత మహిళకు ఆసుపత్రి యాజమన్యం భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మెక్‌డోవెల్ ఆక్లాండ్ డిస్ట్రిక్ట్ హెల్త్ బోర్డ్ నివేదికలో ఆదేశించింది. ఈ మేరకు కేసును ప్రొసీడింగ్స్ డైరెక్టర్‌కి రిఫర్ చేశారు. డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో దూది, కత్తెర వంటి మర్చిపోతుంటారని విన్నాం గానీ మరీ ప్లేట్ మర్చిపోయేంత నిర్లక్ష్యంగా ఉంటారా అనేలా ఉందీ సంఘటన.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.