
ఓ యువకుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చాడు. పని పూర్తి చేసుకుని కార్డు తన జేబులో పెట్టుకుంటుండగా.. ఒక్కసారిగా అలజడి.. ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి అతడిపై దాడి చేశాడు. గోడకు నొక్కేస్తూ డబ్బులు ఇవ్వమని కత్తితో బెదిరించాడు. కట్ చేస్తే.. ఆ ఆగంతకుడిపై రివర్స్ అయ్యాడు సదరు యువకుడు. అతడు వేసుకున్న ముసుగు లాగేశాడు. అంతే! అతడెవరో చూడగానే ఆ యువకుడికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
వివరాల్లోకి వెళ్తే.. స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్గోలో నివసిస్తున్న ఓ 17 ఏళ్ల యువకుడు తన ఇంటి దగ్గరలో ఉన్న ఏటీఎంలోకి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. డబ్బులు కలెక్ట్ చేసి.. కార్డ్ జేబులో పెట్టుకుంటుండగా.. ముసుగు ధరించిన ఓ ఆగంతుకుడు వచ్చి అతడ్ని గోడకు బలంగా నెట్టేసి.. వెనక్కి తిరగనివ్వకుండా నొక్కుతూ డబ్బులు ఇవ్వాలని మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. దీంతో ఆ యువకుడు కొంచెం భయపడినా.. గొంతు ఎక్కడో విన్నట్లు ఉందని.. మరోసారి ఏం కావాలంటూ అడుగుతాడు. ఇక ఆగంతకుడు అతడి మాటలు పట్టించుకోకుండా.. డబ్బులు ఇవ్వాలంటూ గట్టిగా అరుస్తాడు. అయితే ఈలోగా యువకుడు ధైర్యాన్ని కూడగట్టుకుని.. అతడిపై ఎదురుదాడికి దిగాడు. వెనక్కి తిరిగి ఆ ఆగంతకుడి ముఖం చూసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతడి ముసుగును తొలగించాడు. అంతే.! ఆ వ్యక్తి మరెవరో కాదు.. అతడి తండ్రి.
‘ఇదేం పని..! అసలేం చేస్తున్నావ్ నాన్న..’ అంటూ నిలదీస్తాడు సదరు యువకుడు. వెంటనే ఏటీఎం బయటకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఖాకీలు ఆ అగంతకుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. తన నేరాన్ని అంగీకరించిన ఆగంతకుడు.. ఏటీఎం వద్ద తన కొడుకు ఉన్నాడన్న సంగతి తెలియదని.. దొంగతనం చేయడానికే అక్కడి వచ్చానని తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు నిందితుడికి 26 నెలల జైలు శిక్షను విధించింది.