PM Modi: మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి.. ప్రధాని మోదీకి భారతీయుల ఘనస్వాగతం..

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఏదైనా సరే.. అక్కడ భారతీయులు సృష్టించే సందడే వేరు. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి స్థానిక భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఒకవైపు మా తుజే సలామ్ దేశభక్తి ధునులు మారుమోగుతుంటే, మరోవైపు మహిళా కళాకారుల శివభక్తి నృత్య ప్రదర్శనలు మెల్‌బోర్న్‌ను కాస్తా మినీ ఇండియాగా మార్చేశాయి.

PM Modi: మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి.. ప్రధాని మోదీకి భారతీయుల ఘనస్వాగతం..
Pm Modi Australia Visit 1

Updated on: Jul 09, 2026 | 8:19 AM

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరానికి చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టుతో పాటు ఆయన బస చేసిన హోటల్ వద్ద భారతీయుల నుండి అద్భుత స్వాగతం లభించింది. ప్రధాని మోదీని చూసేందుకు హోటల్ వద్ద వందలాది మంది భారతీయులు గంటల తరబడి నిరీక్షించారు. ప్రధాని మోదీ రాకతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా పండగలా మారిపోయింది. “భారత్ మాతా కీ జై”, “మోదీ-మోదీ” అంటూ ప్రజలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. ఈ సందర్భంగా అక్కడి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దేశభక్తి గీతాలతో ప్రధానికి స్వాగతం

కళాకారులు మా తుఝే సలామ్, వందేమాతరం దేశభక్తి గీతాల ధునులతో ప్రధానికి స్వాగతం పలికారు. వారి గీతాలకు మోదీ సైతం ఫిదా అయిపోయారు. మహిళా కళాకారులు భక్తిభావం ఉట్టిపడేలా ప్రదర్శించిన శివ భక్తి నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. కళాకారుల ప్రతిభను చూసి ముగ్ధులైన ప్రధాని మోదీ.. నిరంతరం చప్పట్లు కొడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ప్రదర్శన ఇచ్చిన వారందరికీ చేతులు జోడించి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ ట్విట్

ఈ పర్యటనకు సంబంధించి ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ‘‘నేను మెల్‌బోర్న్ చేరుకున్నాను. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. ప్రధాని అల్బనీస్‌తో జరగబోయే చర్చల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అలాగే ఇరు దేశాల బంధానికి వెన్నెముకగా నిలుస్తున్న భారతీయ సమాజంతో మాట్లాడేందుకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాను” అని రాసుకొచ్చారు. అదేవిధంగా ప్రధాని పర్యటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ మెల్‌బోర్న్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనంగా, ప్రత్యేక శైలిలో స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి ప్రధాని మోదీ 3వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు సహ-అధ్యక్షత వహించనున్నారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలువురు ప్రముఖులతో ప్రధాని సమావేశం కానున్నారు” అని తెలిపారు.

చైనాకు చెక్ పెట్టేలా కీలక రక్షణ, ఖనిజ ఒప్పందాలు?

ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ సామ్ మోస్టిన్‌తో పాటు పలువురు వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా రక్షణ రంగంతో పాటు యురేనియం, రేర్ ఎర్త్ మెటీరియల్స్ సరఫరాపై ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా దూకుడుకు బ్రేక్ వేసేందుకు భారత్, ఆస్ట్రేలియాల మధ్య బలపడుతున్న ఈ ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత కీలకం కానున్నాయని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us