‘ట్రంప్‌ ఒక సైతాన్‌.. త్వరలో మరపురాని గుణపాఠం చెబుతాం..’ ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ హెచ్చరిక

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, గత నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంతకం "విలువలేనిది, చెల్లనిది" అని వ్యాఖ్యానించారు. అమెరికా ఒప్పంద నిబంధనలను పలుమార్లు ఉల్లంఘించిందని ఆరోపించిన ఇరాన్, ఇకపై ఆ ఒప్పందానికి సంబంధించిన తన బాధ్యతలను అమలు చేయబోదని ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికా వరుసగా ఏడో రోజు ఇరాన్‌పై దాడులు కొనసాగించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి..

ట్రంప్‌ ఒక సైతాన్‌.. త్వరలో మరపురాని గుణపాఠం చెబుతాం.. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ హెచ్చరిక
Mojtaba Tears Into Trump Over Iran Deal

Updated on: Jul 19, 2026 | 11:26 AM

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత నెలలో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంతకం విలువలేనిది, చెల్లనిది (Worthless) అని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా పలుమార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఖమేనీ.. అమెరికాను ‘సైతాన్’గా అభివర్ణించింది. అమెరికా యుద్ధాన్ని ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తోందని, దాని పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. ‘అమెరికా యుద్ధాన్ని రెచ్చగొట్టాలని చూస్తోంది. అయితే ఇరాన్ ప్రజలు, ప్రతిఘటన శక్తులు అమెరికాకు మరపురాని పాఠాలు నేర్పుతాయని’ ఖమేనీ వ్యాఖ్యానించారు.

అమెరికా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని, ఒప్పంద ఉల్లంఘనలు ఆ దేశం నిజాయితీ లేమి, విశ్వసనీయత లోపం, దురుద్దేశాలను స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బలవంతం, ఆధిపత్య ధోరణి, క్రూరత్వం అమెరికా విధానాల్లో అంతర్భాగమని విమర్శించారు. మరోవైపు ఈ నెలలో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ ప్రజలు దాదాపు 50 మంది మృతి చెందగా, 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాము తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన తమ బాధ్యతలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని, అందువల్ల ఇరాన్ కూడా ఇకపై ఆ ఒప్పందాన్ని అమలు చేయబోదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ ప్రకటించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున కూడా ఇరాన్‌పై దాడులు కొనసాగాయి. వరుసగా ఏడో రోజు జరిగిన ఈ దాడుల్లో నిఘా కేంద్రాలు, సైనిక సరఫరా మౌలిక సదుపాయాలు, భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలు, సముద్ర సంబంధిత సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఇరాన్‌-అమెరికా యుద్ధం.. ఇరకాటంలో హోర్ముజ్ జలసంధి

ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రపంచ ముడి చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, దాడుల కారణంగా పౌరులు, కీలక మౌలిక సదుపాయాలు, తాగునీటి కోసం ఉపయోగించే డీశాలినేషన్ ప్లాంట్లు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us