అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు.. డైలమాలో పాకిస్తాన్..!

ఇరాన్‌తో చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం పాకిస్తాన్‌కు చేరుకుంది. శనివారం ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతాయని పాకిస్తాన్‌ ‌ ప్రభుత్వం ప్రకటించింది. చర్చలు సానుకూలంగా ఉంటాయని భావిస్తునట్టు అమెరికా వైస్‌ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ తెలిపారు. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపితేఏ చర్చలు ముందుకెళ్లే అవకాశం ఉందని ఇరాన్‌ స్పష్టం చేసింది.

అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు.. డైలమాలో పాకిస్తాన్..!
Iran Us Talks In Pakistan

Updated on: Apr 10, 2026 | 9:20 PM

ఇరాన్‌తో చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం పాకిస్తాన్‌కు చేరుకుంది. చర్చలు సానుకూలంగా ఉంటాయని భావిస్తునట్టు అమెరికా వైస్‌ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ తెలిపారు. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపితేఏ చర్చలు ముందుకెళ్లే అవకాశం ఉందని ఇరాన్‌ స్పష్టం చేసింది.

ఇరాన్‌తో శాంతిచర్చల కోసం అమెరికా బృందం రెడీ అయ్యింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వం లోని బృందం పాకిస్తాన్‌ చేరుకుంది. శనివారం ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతాయని పాకిస్తాన్‌ ‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్‌-అమెరికా మధ్య ముందుగా ప్రత్యక్ష చర్చలకు బదులు.. మధ్యవర్తులతో రెండుదేశాల ప్రతినిధి బృందాల చర్చలు జరిపే అవకాశం ఉంది. అమెరికా బృందంలో జేడీ వాన్స్‌తో పాటు కుశ్నర్‌ , స్టీవ్‌ విట్కాప్‌ సభ్యులుగా ఉన్నారు.

శనివారం (ఏప్రిల్ 11) ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగనున్న కీలక శాంతి చర్చల నేపథ్యంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. చర్చలు ప్రారంభం కావడానికి కొద్ది క్షణాల ముందు ఇరాన్ రెండు ప్రధాన షరతులను ముందుకు తెచ్చింది. ఇది ఈ సమావేశం ప్రాముఖ్యతను మరింత పెంచింది. చర్చలకు ముందు రెండు సమస్యలను పరిష్కరించాలని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ అన్నారు. మొదటిది, లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలు చేయాలి. రెండవది, ఇరాన్ నిరోధిత ఆస్తులను విడుదల చేయాలి. ఈ రెండు షరతులను నెరవేర్చకుండా చర్చలు ప్రారంభం మొదుల కావని ఆయన స్పష్టంగా చెప్పారు.

అమెరికా-ఇరాన్‌ చర్చల సందర్భంగా పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. అయితే ఇరాన్‌ ప్రతినిధి బృందం రాకపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపేదాకా.. తాము శాంతిచర్చలకు హాజరయ్యే ప్రసక్తే లేదని అంటోంది ఇరాన్‌. లెబనాన్‌లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేదాకా.. తాము ఇస్లామాబాద్‌ శాంతిచర్చలకు వెళ్లేది లేదని ఇరాన్‌ ప్రకటించింది. ఇరాన్‌ హెచ్చరికల తరువాత లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపేసింది. దీంతో శనివారం అమెరికా , ఇరాన్‌ మధ్య చర్చలకు సానుకూల సంకేతాలు వచ్చాయి.

ఇదిలా ఉండగా, తాను యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఇస్లామాబాద్‌కు వస్తున్నానని చెబుతూ, అమెరికాతో ఆటలు ఆడవద్దని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ టెహ్రాన్‌ను హెచ్చరించారు. మరోవైపు, ఇటీవల జరిగిన వైమానిక దాడిలో గాయపడిన ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ ఖర్రాజీ మరణం మరింత ఉద్రిక్తతలను పెంచింది. ఆయన మహమ్మద్ ఖతామీ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అణు కార్యక్రమంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఆందోళనను రేకెత్తించాయి.

మరోవైపు, ఈ ఉన్నత స్థాయి సమావేశం కోసం పాకిస్థాన్ భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రతను సమీక్షిస్తూ, హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ, ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం పాకిస్థాన్‌కు గౌరవమని అన్నారు. ఇస్లామాబాద్‌లో 10,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు, “రెడ్ జోన్”ను మూసివేశారు. ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. నగరం అంతటా కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు.

శనివారం ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగనున్న శాంతి చర్చలపై ఆశలు పెరిగినప్పటికీ, పాకిస్తాన్ రిస్కులు తీసుకోవడానికి వెనుకాడుతోంది. రెండు వారాల కాల్పుల విరమణ ఉన్నప్పటికీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అధికంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ కార్యకలాపాలకు అవకాశం ఉన్నందున, విమానంలో రానున్న ఇరాన్ ప్రతినిధి బృందం భద్రత విషయంలో పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉంది.

పాకిస్తాన్ ముందుజాగ్రత్త చర్యగా తన యుద్ధ విమానాలు, సి-130 రవాణా విమానాలు, ఇంధనం నింపే ట్యాంకర్లు, AWACS విమానాలను మధ్యప్రాచ్యానికి పంపింది. ఇటీవలి సంవత్సరాలలో ఇది అత్యంత ముఖ్యమైన దౌత్య సమావేశాలలో ఒకటిగా పరిగణిస్తున్నందున, ఈ చర్య ఇస్లామాబాద్‌పై పెరుగుతున్న ప్రపంచ ఒత్తిడిని ప్రతిబింబిస్తుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు.

గతంలో, దాదాపు 2,000 మంది ప్రాణాలను బలిగొన్న అమెరికా-ఇరాన్‌ల మధ్య 40 రోజుల పాటు జరిగిన యుద్దాన్ని, పాకిస్తాన్ తన మిత్రదేశమైన చైనా సహాయంతో తాత్కాలికంగా నిలిపివేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు, పాకిస్తాన్ ఈ ఉద్రిక్తతలకు శాశ్వతంగా ముగింపు పలకడానికి కృషి చేస్తోంది. పొంచి ఉన్న ముప్పును ఊహించి, ఇస్లామాబాద్ వాస్తవంగా అభేద్యమైన దుర్గంలా మారిపోయింది. ఇస్లామాబాద్ నగరం దక్షిణ పశ్చిమ గగనతలంలో రక్షణ వ్యవస్థలు పూర్తిగా క్రియాశీలం చేశారు. ఈ సమావేశం విజయం తమ అంతర్జాతీయ ప్రతిష్టతో ముడిపడి ఉందని పాకిస్తాన్‌కు బాగా తెలుసు, అందుకే భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి ప్రయత్నాన్నీ వదిలిపెట్టడం లేదు.

ఇదిలావుంటే, చర్చలకు ముందు అమెరికా-ఇరాన్‌ దేశాధినేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లెబనాన్‌పై దాడులు చేయాలని తామే ఇజ్రాయెల్‌ను కోరినట్టు ట్రంప్‌ ప్రకటించారు. అయితే హర్మూజ్‌ విషయంలో తమ వైఖరి మార్చుకుంటామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ తెలిపారు. ఇరాన్‌కు చేరువలో మరో అమెరికా డ్రోన్‌ మాయమైంది. అమెరికా నేవీకి చెందిన MQ-4C ట్రిటాన్‌ డ్రోన్‌ తమ ట్రాకింగ్‌కు అందడం లేదని అగ్రరాజ్యం అంటోంది. హర్మూజ్‌ జలసంధి మీద 3 గంటలపాటు చక్కర్లు కొట్టింది డ్రోన్‌. ఇటలీలోని నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా అమెరికా గస్తీ డ్రోన్‌ ట్రాకింగ్‌ నుంచి మిస్సయినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ అధునాతన MQ-4C ట్రిటాన్‌ డ్రోన్‌ విలువ 1,850 కోట్ల రూపాయలు. డ్రోన్‌ ఆచూకీ కోసం అమెరికా నేవీ అన్వేషణ కొనసాగిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us