6 రోజుల క్రితం మిస్సింగ్.. బ్యాగ్ దొరికిన చోటే మృతదేహం.. సాకేత్ మరణం వెనుక మిస్టరీ ఏంటి..?

అమెరికా.. భారతీయ విద్యార్థుల కలల సౌధం. కానీ ఇటీవల కాలంలో అక్కడ జరుగుతున్న వరుస మరణాలు ఆ కలలను కన్నీరుగా మారుస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య విషాదాంతం మరోసారి విదేశాల్లో మన విద్యార్థుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. సాకేత్ ఎలా చనిపోయాడు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

6 రోజుల క్రితం మిస్సింగ్.. బ్యాగ్ దొరికిన చోటే మృతదేహం.. సాకేత్ మరణం వెనుక మిస్టరీ ఏంటి..?
Saketh Srinivasaiah Dead In California

Updated on: Feb 15, 2026 | 1:18 PM

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి గొప్పవాడవుతాడనుకున్న ఒక భారతీయ మేధావి కథ విషాదాంతమైంది. కాలిఫోర్నియాలో ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన కర్ణాటకకు చెందిన విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య 22) మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కెమికల్, బయోమోలిక్యులర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేస్తున్న సాకేత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 9న క్యాంపస్ నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో సాకేత్ చివరిసారిగా కనిపించాడు. ఆ తర్వాత అతని ఆచూకీ లభించకపోవడంతో బర్కిలీ పోలీసులు, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగింది. లేక్ అంజా, బర్కిలీ హిల్స్ వంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో టిల్డెన్ రీజినల్ పార్క్ సమీపంలో సాకేత్‌కు చెందిన పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్ లభ్యం కావడంతో అనుమానాలు బలపడ్డాయి. చివరకు అతను నిర్జీవంగా కనిపించడం అందరినీ కలచివేసింది.

భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు

సాకేత్ శ్రీనివాసయ్య సామాన్య విద్యార్థి కాదు. అతను గతంలో IIT మద్రాస్‌లో చదువుకున్నాడు. అంతేకాకుండా భవిష్యత్ రవాణా వ్యవస్థగా భావించే హైపర్ లూప్ టెక్నాలజీకి సంబంధించిన ఒక పేటెంట్‌లో కూడా అతను భాగస్వామి. ఇంతటి ప్రతిభావంతుడు చిన్న వయసులోనే మృత్యువాత పడటం విచారకరం. సాకేత్ మృతిని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. “సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం లభించడం అత్యంత బాధాకరం. అతని భౌతిక కాయాన్ని త్వరగా భారతదేశానికి పంపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటాం” అని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది

చర్చనీయాంశంగా విద్యార్థుల భద్రత

విదేశాల్లో భారతీయ విద్యార్థులపై దాడులు లేదా అనుమానాస్పద మరణాలు పెరుగుతుండటంపై లోక్‌సభలోనూ చర్చ జరిగింది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ అంశాన్ని లేవనెత్తగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. విదేశీ యూనివర్సిటీల్లోని విద్యార్థులతో రాయబార కార్యాలయాలు నిరంతరం టచ్‌లో ఉంటున్నాయని, అక్కడ ఎదురయ్యే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపింది.

తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక

ఇది ప్రమాదమా? మానసిక ఒత్తిడి కారణమా? లేక మరేదైనా కుట్ర ఉందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, భద్రతాపరమైన సవాళ్లపై ఈ సంఘటన మరోసారి హెచ్చరికగా నిలిచింది.