
భారత్, నేపాల్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తున్న సరిహద్దు వివాదంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కాలాపానీ, లిపులేఖ్ సరిహద్దులపై నేపాల్ పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ‘‘కేవలం భారత్ మాత్రమే కాదు.. నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాన్ని ఆక్రమించింది’’ అంటూ ఆయన చేసిన ప్రకటన ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపింది. తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశంలో సరిహద్దులపై ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రధాని బాలేంద్ర షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు ఇది వింతగా అనిపించవచ్చు.. కానీ ప్రధాని అయిన తర్వాతే నాకూ ఈ విషయం తెలిసింది. చాలా చోట్ల భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా భారత భూభాగంలోకి చొచ్చుకెళ్లింది’’ అని ప్రధాని అనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. నేపాలీ కాంగ్రెస్, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నేపాల్ ఎక్కడ భారత భూభాగాన్ని ఆక్రమించిందో ప్రధాని వెంటనే సభకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్న ఈ బాధ్యతారహిత వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుండి వెంటనే తొలగించాలని పట్టుబట్టారు.
దాదాపు రెండు శతాబ్దాలుగా భారత్, నేపాల్ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన లిపులేఖ్ పాస్ వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ఈ ప్రాంతం గుండా భారత్ కైలాష్ మానససరోవర్ యాత్ర కోసం సులభతరమైన రహదారిని నిర్మించింది. ఈ లిపులేఖ్ పాస్ అనేది తమ భూభాగంలోనే ఉన్న చారిత్రాత్మక వాణిజ్య, పుణ్యక్షేత్ర మార్గమని భారత్ మొదటి నుండి స్పష్టం చేస్తోంది. రక్షణ పరంగా కూడా భారత్‌కు ఇది అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. గతంలో 2020లో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలి హయాంలో లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలను నేపాల్ తమ అధికారిక మ్యాప్‌లో చేర్చుకుంటూ ఏకంగా రాజ్యాంగ సవరణ కూడా చేసింది. అటువంటి వివాదాస్పద నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు నేపాల్‌ను ఆత్మరక్షణలో పడేశాయి.
ప్రధాని వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో నేపాల్ విదేశాంగశాతం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ప్రధాని వ్యాఖ్యలను సమర్థిస్తూ వారు ఒక అధికారిక వివరణ ఇచ్చారు. ఈ వివాదం దాస్‌గజా సరిహద్దు ప్రాంతంలో నదీ ప్రవాహాల్లో వచ్చిన మార్పుల వల్ల ఏర్పడిన సాంకేతిక సమస్య అని పేర్కొంది. సరిహద్దు నదులు తమ మార్గాన్ని మార్చుకున్నప్పుడు, ఒక దేశ పౌరులు తెలియకుండానే అవతలి దేశ భూభాగంలో వ్యవసాయం లేదా నివాసాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. టెక్నికల్ కమిటీ అధ్యయనంలో తేలిన ఈ అంశాన్ని ఉద్దేశించే ప్రధాని మాట్లాడారని స్పష్టం చేసింది.
చివరగా భారత్‌తో ఉన్న సుదీర్ఘ స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా.. చారిత్రక ఒప్పందాలు, పాత మ్యాప్‌ల ఆధారంగా కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే ఈ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి నేపాల్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.