
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్ ఉండేది. ఆ స్థానాన్ని తర్వాత లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం ఆక్రమించింది. ఈ ఏడాది 2026 విషయానికొస్తే దక్షిణ కొరియాలోని ఇంచియాన్ విమానాశ్రయం నెంబర్ వన్‌గా అవతరించింది. ఇంచియాన్ అగ్రస్థానాన్ని పొందడం ఇదే తొలిసారి. కొత్త గుర్తింపుతో గ్లోబల్ హబ్ విమానాశ్రయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ గణాంకాల ప్రకారం.. అధిక సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను నిర్వహించిన విమానాశ్రయంగా ఇంచియాన్ గుర్తింపు పొందింది. 2026లో 38.4 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందించింది. రెండో స్థానంలో లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్ 37.79 మిలియన్‌ల ప్రయాణికులతో, సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయం 34.53 మిలియ న్లతో మూడో స్థానంలో నిలిచాయి.
2025 సంవత్సరంలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన దుబాయ్ అల్ ముక్తమ్ ఎయిర్‌పోర్ట్ ఈసారి టాప్ 5 ర్యాంకింగ్ లిస్ట్ లోనే లేదు. అమెరికా–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లడం ఇంచియాన్ విమానాశ్రయానికి కలిసొచ్చింది. యూరప్‌కు వెళ్లేందుకు గతంలో దుబాయ్ మీదుగా ప్రయాణించే వారు ఇప్పుడు ఇంచియాన్ మీదుగా వెళుతున్నారు. దాంతో ప్రయాణికుల సంఖ్య 18% పెరిగింది.
ఇజ్రాయెల్, అమెరికా వరుస దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. అరబ్ దేశాల్లోని అమెరికాకు చెందిన టెక్ సంస్థలు వాటి కార్యాలయాలపై విరుచుకుపడుతోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటిదాకా ఇరాన్ ఇదే తీరుగా దాడుల పరంపర కొనసాగిస్తోంది. ఇరాన్ దాడులకు గల్ఫ్ దేశాల్లోని విమానాశ్రయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఒకప్పుడు పర్యాటకులకు స్వర్గధామంగా ఉన్న దుబాయ్ ప్రస్తుతం సందడి లేక వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల తన బ్యాంకుల్లో ఫ్రీజ్ అయి ఉన్న రెండు టన్నుల బంగారాన్ని ఇరాన్‌కు పంపించి ఇరాన్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది యూఏఈ. అమెరికా ఆంక్షల కారణంగా రెండు టన్నుల బంగారం యూఏఈ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయి ఉంది. ఇరాన్ బంగారాన్ని విడిపించింది యూఏఈ. కమర్షియల్ విమానాలను కూడా తన వంతు సాయంగా అందించింది. యూఏఈ అందించిన స్నేహహస్తాన్ని స్వీకరించి తమ పై దాడులను ఇరాన్ నిలిపివేస్తుందని యూఏఈ భావిస్తోంది. అదే జరిగితే మళ్లీ దుబాయ్ విమానాశ్రయం పర్యాటకులతో కళకళలాడే అవకాశం ఉంది.