తాలిబన్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌లో జిల్లా కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు దళాలు!

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన ఇంకా కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన సంకేతాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఈశాన్య బదఖ్షాన్ ప్రావిన్స్‌లోని యఫ్తల్-ఎ-పాయీన్ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని తాలిబన్ వ్యతిరేక సాయుధ బృందం కొన్ని గంటల పాటు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే తాలిబన్ అధికారులు దాడి జరిగిన విషయాన్ని అంగీకరిస్తూనే, అది పెద్ద భద్రతా వైఫల్యం కాదని పేర్కొంటూ కొద్ది గంటల్లోనే జిల్లాపై తిరిగి నియంత్రణ సాధించినట్లు వెల్లడించారు.

తాలిబన్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌లో జిల్లా కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు దళాలు!
Sepahian E Mihan Attack
Image Credit source: AI Image

Updated on: Jul 21, 2026 | 6:44 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన ఇంకా కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన సంకేతాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఈశాన్య బదఖ్షాన్ ప్రావిన్స్‌లోని యఫ్తల్-ఎ-పాయీన్ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని తాలిబన్ వ్యతిరేక సాయుధ బృందం కొన్ని గంటల పాటు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే తాలిబన్ అధికారులు దాడి జరిగిన విషయాన్ని అంగీకరిస్తూనే, అది పెద్ద భద్రతా వైఫల్యం కాదని పేర్కొంటూ కొద్ది గంటల్లోనే జిల్లాపై తిరిగి నియంత్రణ సాధించినట్లు వెల్లడించారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, శుక్రవారం (జూలై 17) తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో సాయుధ వ్యక్తులు జిల్లా కేంద్రంపై దాడి చేసి అక్కడ ఉన్న తాలిబన్ సిబ్బందిని నిరాయుధులను చేసినట్లు సమాచారం. అనంతరం జిల్లా పరిపాలనా భవనంపై ‘సెపహియాన్-ఎ మిహాన్’ అనే కొత్తగా ప్రకటించిన తాలిబన్ వ్యతిరేక బృందం జెండాను ఎగురవేసినట్లు పేర్కొన్నారు. కొన్ని గంటల తర్వాత ఆ బృందం వెనుదిరగగా, తాలిబన్ భద్రతా దళాలు మళ్లీ జిల్లా కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ దాడిలో పాల్గొన్న పలువురు అనుమానితులను అరెస్టు చేసినట్లు బదఖ్షాన్ పోలీసులు వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. భద్రతా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని అంగీకరిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆఫ్ఘాన్ అధికారులు చెప్పారు. తాలిబన్ సైన్యాధిపతి ఖారీ ఫసిహుద్దీన్ ఫిట్రాత్ ఈ ఘటనను ప్రచార స్టంట్‌గా అభివర్ణించారు. వివిధ చిన్న సాయుధ బృందాలు తమ ఉనికిని చాటుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని, తాలిబన్ భద్రతా దళాలను ఎదుర్కొనే సామర్థ్యం వాటికి లేదని వ్యాఖ్యానించారు. విదేశీ శక్తుల పాత్ర ఉండొచ్చని ఆయన సూచించినప్పటికీ, అందుకు ఎలాంటి ఆధారాలు వెల్లడించలేదు.

ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించిన సెపహియాన్-ఎ మిహాన్ బృందానికి మాజీ ఆఫ్ఘాన్ జాతీయ సైన్య అధికారి ఖయ్యూమ్ ఖాన్ మలాంగ్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. అమెరికా మద్దతు ఉన్న ఆఫ్ఘాన్ ప్రభుత్వ హయాంలో ఆయన సైన్యంలో పనిచేయడంతో పాటు అమెరికా ప్రత్యేక దళాలతో కలిసి శిక్షణ పొందినట్లు సమాచారం. 2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (NRF)తో కలిసి పనిచేసిన ఆయన, అనంతరం స్వంత సాయుధ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్వతంత్రంగా ధృవీకరించడం పరిమితంగానే ఉన్నప్పటికీ, స్థానిక మీడియా కథనాల ప్రకారం ఇది నిజమైతే 2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జిల్లా ప్రధాన కార్యాలయం తాత్కాలికంగా తాలిబన్ నియంత్రణ నుంచి బయటకు వెళ్లిన తొలి ఘటనగా అవుతుందంటున్నారు రాజకీయ నిపుణులు. ఈ సంఘటనతో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ వ్యతిరేక సాయుధ ప్రతిఘటన పూర్తిగా ముగియలేదనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us