
పాకిస్తాన్‌లో మరోసారి హిందువుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణ హిందువులే కాదు, పాక్ ప్రభుత్వంలోని మంత్రులు కూడా సురక్షితంగా లేరు. కొత్త కాలువల ప్రణాళికలకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న నిరసనకారులు సింధ్ ప్రావిన్స్‌లోని ఒక హిందూ మంత్రిపై దాడి చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ఎంపీ, మత వ్యవహారాల సహాయ మంత్రి ఖేల్ దాస్ కోహిస్తానీ శనివారం(ఏప్రిల్ 19) తట్టా జిల్లా గుండా వెళుతుండగా, కొంతమంది నిరసనకారులు ఆయన కాన్వాయ్‌పై టమోటాలు, బంగాళాదుంపలు విసిరారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దాడిలో కోహిస్తానీకి ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ స్పందించారు. కోహిస్తానీకి ఫోన్ చేసి జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారని రేడియో పాకిస్తాన్ పేర్కొంది. “ప్రజా ప్రతినిధులపై దాడి ఆమోదయోగ్యం కాదు, ఈ సంఘటనలో పాల్గొన్న వారికి కఠినమైన శిక్ష విధించడం జరుగుతుంది” అని ప్రధానమంత్రి షాబాజ్ అన్నారు.
ఎంపీ ఖేల్ దాస్ కోహిస్తానీపై జరిగిన దాడిని పాకిస్తాన్‌లోని చాలా మంది నాయకులు ఖండించారు. సమాచార మంత్రి అట్టా తరార్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సింధ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) గులాం నబీ మెమన్ నుండి, సమాఖ్య అంతర్గత కార్యదర్శి నుండి నివేదికను కోరారు. సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని షా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాడిలో పాల్గొన్న దుండగులను వెంటనే అరెస్టు చేసి నివేదిక సమర్పించాలని ఆయన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించారు.
కోహిస్తానీలు ఎవరు?
నేషనల్ అసెంబ్లీ వెబ్‌సైట్‌లోని వ్యక్తిగత వివరాల ప్రకారం, కోహిస్తానీ సింధ్‌లోని జంషోరో జిల్లాకు చెందినవారు. 2018లో PML-N నుండి మొదటిసారి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత, అతను 2024లో తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.
وزیر مملکت مذہبی امور کھیل داس کوہستانی پر ٹھٹھہ میں حملہ کس نے کیا خود ان کی اپنی زبانی سنیے۔ 👇👇 pic.twitter.com/qtRseTaHaM
— WAQAR SATTI 🇵🇰 (@waqarsatti) April 19, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..