
ప్రస్తుతం పశ్చిమాసియా అట్టుడుకుతుంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య గత ఐదు రోజులుగా జరుగుతున్న భీకర యుద్దంతో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా రెండు దేశాలు తగ్గేదేలే అంటున్నారు. పరస్పరం మిసైళ్లు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ఆయా దేశాల్లో నివసిస్తున్న తెలుగు విద్యార్థుల భద్రతపై వారి కుటుంబ సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో వారిని వెంటనే తిరిగి భారత్‌కు రప్పించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో నివసించే తెలంగాణ పౌరుల భద్రతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయా దేశాల్లో నివసించే తెలంగాణ పౌరులకు అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండేందుకు నలుగురు కీలక అధికారులు ప్రభుత్వం నియమించింది. బాధితులు ఫోన్ చేసి వివరాలు తెలిపేందుకు అధికారుల వారి ఫోన్ నంబర్లను కూడా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో ఉన్న సీనియర్ అధికారుల సమన్వయంతో పనిచేసే ఈ హెల్ప్‌లైన్, విదేశాలలో ఉన్న తెలంగాణ పౌరుల భద్రతపై కుటుంబసభ్యుల ప్రశ్నలకు సమాధానాలు అందించడంతో పాటు వారి మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయనుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..