చాలామందికి వ్యాపారం చేయాలని ఉన్నా చేయలేరు. ఎందుకంటే వ్యాపారమంటే ఎన్నో ఒడుదొడుకులుంటాయి. ఎంతో ఖర్చుపెట్టి, అప్పులు చేసి పెట్టిన వ్యాపారంలో నష్టపోతే కోలుకోవడం కష్టమే. అందుకే చాలామంది సామర్థ్యం ఉన్నా వ్యాపారం చేయాలంటే వెనకడుగు వేస్తుంటారు. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని వ్యాపారం చేయడానికి భయపడతారు. అలాంటి వారి కోసం యూఏఈ ప్రభుత్వం బంగారం లాంటి అవకాశాన్నిస్తోంది. ఉద్యోగం వదులుకోకుండానే తమ కలను నిజం చేసుకునే ఆఫర్ ప్రకటించింది. ఏడాదిపాటు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్ లీవ్ ప్రకటించింది. ఉద్యోగం చేయకుండానే నెలనెలా జీతం తీసుకుంటూ వ్యాపారం చేసుకోండంటూ సెలవిచ్చింది.
ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే హ్యాపీ.. లేదంటే మీ ఉద్యోగం మీకే ఉంటుందంటూ ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను వ్యాపారం వైపు ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వివరించారు. సెలవు పెట్టిన ఏడాదిలో నెలనెలా సగం జీతం ఇస్తామని చెప్పారు. ఈ సెలవును వినియోగించుకోవాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
ఇదిలా ఉంటే వారంలో ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను నాలుగున్నర రోజులకు కుదిస్తూ యూఏఈ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి.