Russia Ukraine Crisis: క్షేమంగా బయటపడ్డ భారతీయ విద్యార్థులు.. ఢిల్లీ చేరిన రెండో విమానం!

|

Feb 27, 2022 | 7:21 AM

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయ పౌరులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి రెండవ తరలింపు విమానం ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.

Russia Ukraine Crisis: క్షేమంగా బయటపడ్డ భారతీయ విద్యార్థులు.. ఢిల్లీ చేరిన రెండో విమానం!
Indian Students 1
Follow us on

Russia Ukraine Conflicts: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయ పౌరులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి రెండవ తరలింపు విమానం ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఉక్రెయిన్ నుండి బుకారెస్ట్ (రొమేనియా) మీదుగా సురక్షితంగా తరలించిన భారతీయులకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ స్వాగతం పలికారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న భారతీయ పౌరులతో కూడా జ్యోతిరాదిత్య సింధియా సంభాషించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ టచ్‌లో ఉన్నారని, ప్రతి ఒక్కరినీ సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రాజుల పాటి అనూష ,సిమ్మ కోహిమ వైశాలి వేముల వంశి కుమార్, అభిషేక్ మంత్రి, జయశ్రీ ,హర్షిత కౌసర్ ,సూర్య సాయి కిరణ్ ఉన్నారు. తెలంగాణ విద్యార్థులు వివేక్, శ్రీహరి, తరుణ్ ,నిదిష్ ,లలితా, దేవి ,దివ్య , మనీషా ,రమ్య , ఐశ్వర్య ,మాన్య ,మహిత, ప్రత్యూష ,గీతిక ,లలిత ,తరణి ఉన్నారు. విద్యార్థులను రిసీవ్ చేసుకున్న తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్.. ప్రత్యేక బస్సులో తెలంగాణ భవన్‌కు తరలించారు. అటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు కు టికెట్స్ బుక్ చేసి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. కేరళకు చెందిన విద్యార్థులకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా కేరళకు పంపించే ఏర్పాట్లు చేశారు.

అదే సమయంలో, ఈ విమానంలో తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థి మాట్లాడుతూ, “విద్యార్థులు భయపడుతున్నారు. అయితే మేము ఉంటున్న నగరంలో (రొమేనియా సరిహద్దు సమీపంలో) పరిస్థితి ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల కంటే చాలా మెరుగ్గా ఉంది.” భారతీయ విద్యార్థి అతీష్ నగర్ మాట్లాడుతూ, “10,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు, వారిని త్వరగా భారతదేశానికి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము, వారు కూడా త్వరగా ఇక్కడికి తీసుకువస్తారని మేము ప్రభుత్వం నుండి ఆశిస్తున్నాము.” అని అన్నారు.

అదే సమయంలో, దీనికి ముందు మరో ఎవాక్యుయేషన్ ఫ్లైట్ ముంబైలో ల్యాండ్ అయింది. ఇందులో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మాట్లాడుతూ కొంత భయం, భయాందోళనలు నెలకొన్నాయని, అయితే భారత్‌కు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. “భారత ప్రభుత్వం మమ్మల్ని ఖచ్చితంగా మన దేశానికి తిరిగి తీసుకువస్తారని నాకు నమ్మకం ఉంది, కొంత భయం మరియు భయాందోళనలు ఉన్నాయి, అయితే మేము భారతదేశానికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము” అని అన్నారు.

ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థి ధార వోరా మాట్లాడుతూ, “మేము మా దేశం మరియు భారత ప్రభుత్వం గురించి గర్విస్తున్నాము. మిగిలిన విద్యార్థులను వీలైనంత త్వరగా తిరిగి తీసుకువస్తారని మేము ఆశిస్తున్నాము.” అని అన్నారు.