
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఫిబ్రవరి 10 నుండి 12 వరకు ఫ్రాన్స్‌లో అధికారిక పర్యటనకు బయలుదేరారు. తన పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ వివిధ దేశాధినేతలు, ప్రపంచ టెక్ CEOలతో కలిసి పారిస్‌లో జరిగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న AI యాక్షన్ సమ్మిట్‌కు సహ అధ్యక్షత వహిస్తారు. కొత్త ఆవిష్కరణలు, సైబర్ క్రైమ్ భద్రత, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతకు సహకార విధానాన్ని పెంపొందించడంపై ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. AI ప్రపంచ పురోగతిని ఎలా నడిపించగలదో, ప్రజా శ్రేయస్సుకు ఎలా దోహదపడుతుందో చర్చించనున్నారు.
ఏఐ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో భారత్ కోచైర్ పాత్ర పోషించనుంది. ఈ పర్యటనలో భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం మోదీ, మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. 2047 హారిజన్ రోడ్‌మ్యాప్ కింద జరుగుతున్న పరిణామాలను ఇద్దరు నేతలు సమీక్షించనున్నారు. ఈ రోడ్‌మ్యాప్ ద్వైపాక్షిక సంబంధాలను, ముఖ్యంగా వాణిజ్యం, సాంకేతికత, రక్షణ వంటి కీలక రంగాలలో మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అధికారిక పర్యటనలో భాగంగా, ప్రధాన మంత్రి మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ చారిత్రాత్మక ఫ్రెంచ్ నగరమైన మార్సెయిల్‌కు వెళతారు. ఇద్దరు అధినేతలు ఫ్రాన్స్‌లో మొదటి భారత కాన్సులేట్‌ను ప్రారంభిస్తారు. ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. భారత ప్రధాన మంత్రి అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ITER) ప్రాజెక్టును సందర్శిస్తారు. ఇది భారతదేశం కీలక భాగస్వామిగా ఉన్న ఒక ప్రధాన బహుళజాతి ప్రయత్నం. ITER ప్రాజెక్ట్ ప్రపంచ ప్రయోజనం కోసం అణు సంలీన శక్తిని ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం ప్రమేయం స్థిరమైన ఇంధన పరిష్కారాలకు దాని నిబద్ధతగా భావిస్తున్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో అంతిమ త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులు అర్పిస్తారు. యుద్ధాలలో పోరాడిన భారతీయ సైనికుల ధైర్యసాహసాలను గౌరవిస్తూ, మార్సెయిల్‌లోని మజార్గ్స్ యుద్ధ శ్మశానవాటికలో ప్రధాని మోదీ నివాళులర్పిస్తారు.
రెండు రోజుల అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ
ఫ్రాన్స్ పర్యటన తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికాకు వెళతారు. 2025 జనవరిలో అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల విజయం, ప్రమాణ స్వీకారం తర్వాత ఇద్దరు నాయకుల మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి పదవీకాలంలో విజయవంతమైన సహకారంపై, ముఖ్యంగా భారత్, యునైటెడ్ స్టేట్స్ మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో నిర్మించాలనే బలమైన కోరికను ప్రధాని వ్యక్తం చేశారు.
సాంకేతికత, వాణిజ్యం, రక్షణ, ఇంధనం, స్థితిస్థాపకత వంటి రంగాలలో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంపొందతుందని భావిస్తున్నారు. రెండు దేశాలకు, అలాగే ప్రపంచ సమాజానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. అలాగే, మోదీ.. ట్రంప్‌తో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదార్లను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ, ట్రంప్ సమావేశం కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. భారతీయ అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్‌ను ఒప్పిస్తారా? అనేది చూడాలి. అమెరికా పర్యటనలో ఎలాన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు.
Over the next few days, I will be in France and USA to take part in various programmes.
In France, I will be taking part in the AI Action Summit, where India is the co-chair. I will be holding talks with President @EmmanuelMacron towards strengthening India-France relations. We…
— Narendra Modi (@narendramodi) February 10, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..