
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటలకే దక్షిణ లెబనాన్‌లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం (జూన్ 20) తెల్లవారుజామున ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు నబాటియే ప్రాంతంతో పాటు పలు ప్రాంతాలపై వైమానిక దాడులు జరపగా ఐదుగురు మరణించినట్లు లెబనీస్ మీడియా వెల్లడించింది. పలువురు గాయపడగా, అనేక భవనాలు ధ్వంసమయ్యాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, రాత్రి సమయంలో నివాస ప్రాంతాలు లక్ష్యంగా దాడులు జరిగాయి.. ఇళ్లు, వాణిజ్య భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాల్పుల విరమణతో శాంతి నెలకొంటుందని ఆశించిన ప్రజలు మరోసారి భయాందోళనలకు గురయ్యారు. వైమానిక దాడులతో పాటు ఫిరంగి కాల్పులు కూడా కొనసాగినట్లు సమాచారం.
ఇదే ప్రాంతంలో అంతకుముందు జరిగిన దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. కొందరు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. నబాటియే, హరూఫ్, కఫర్ సిర్ తదితర ప్రాంతాలు ఈ దాడుల ప్రభావాన్ని తీవ్రంగా చవిచూశాయి. మరో ఘటనలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు.
అమెరికా, ఖతార్, ఇరాన్ మధ్యవర్తిత్వంతో శుక్రవారం సాయంత్రం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు అంతర్జాతీయ వర్గాలు ప్రకటించాయి. ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.
అయితే కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాడులు పునరావృతం కావడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు ఇది పెద్ద సవాలుగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…