China: ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని ఓ కొత్త రూల్‌ను అమలు చేస్తోంది చైనా. ఇంట్లో జంటలు వేర్వేరుగా పడుకోవాలని, ముద్దులు, కౌగలింతలు వంటివి వద్దని, భోజనం కూడా విడిగానే చేయాలని అధికారులు ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది. దీంతో అధికారులపై గరం గరం అవుతున్నారు అక్కడి ప్రజలు. అయితే, ఈ నిబంధన కూడా కరోనా కట్టడికే అని అధికారులు చెప్పడం కొసమెరుపు. కరోనా కేసులు తగ్గాలని కఠిన ఆంక్షలతో లాక్‌డౌన్ విధించారు చైనా అధికారులు. కానీ, వైరస్ (Virus) సోకిన దానికంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు షాంఘై ప్రజలు. కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడానికి షాంఘై నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మార్చి చివరి వారంలో ప్రకటించింది చైనా. రెండు దశల్లో తొమ్మిది రోజులపాటు ఈ లాక్‌డౌన్ (Lockdown) ఉంటుందని, ఆ సమయంలో అధికారులు భారీగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారని చైనా తెలిపింది. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ ఈ స్థాయిలో ఇక్కడ లాక్‌డౌన్ విధించలేదు. అయితే, లాక్‌డౌన్ కారణంగా షాంఘై (Shanghai )నగరంలో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయని వాపోతున్నారు అక్కడి ప్రజలు.
ప్రభుత్వం డ్రోన్లు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఒక డ్రోన్ ప్రత్యక్షమై కోవిడ్ నిబంధనలు పాటించండి. స్వేచ్ఛ కోసం మీ మనస్సులో నిండిన కోరికను నియంత్రించుకోండి. కిటికీలు తెరవకండి.. పాడకండి అంటూ ఓ నెటిజన్ డ్రోన్ ప్రకటన వీడియోను షేర్ చేశారు. అంతేకాకుండా ఈ రాత్రి నుంచి ఇంట్లో ఉన్న జంటలు వేర్వేరుగా పడుకోండి.. ముద్దులు, కౌగిలింతలు వద్దని, భోజనం చేసే ముందు కూడా విడిగా కూర్చోండి అంటూ వీడియోను పోస్టు చేశారు.
ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కిరాణా సామాన్ల కోసం కూడా బయటకు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో, బుధవారం నాడు సుమారు 20 వేల కేసులు నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో ఇది కొత్త రికార్డు కావడం గమనార్హం. అటు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని అక్కడి అధికారులు కూడా అంగీకరించారు. పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు షాంఘై ఆఫీసర్లు. సోమవారం లాక్‌డౌన్‌ను నిరవధికంగా పొడిగించారు. నిబంధనల ప్రకారం, ఆహారం, నీళ్లు ఇంటికి ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ, డెలివరీ సర్వీసులకు ఎడతెరిపి లేకుండా ఆర్డర్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆహారం, మంచి నీరు ఏదీ ఆర్డర్ చేయలేకపోతున్నామని వాపోయారు ప్రజలు. షాంఘైలో లాక్‌డౌన్ చైనాపై, ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతుందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.
ఇవి కూడా చదవండి: