భారత డిఎన్‌ఏలోనే ఐక్యత-వైవిధ్యం.. అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..

అమెరికా పర్యటనలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ న్యూయార్క్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. భిన్నత్వం, ఐక్యత రెండూ భారతీయ డీఎన్‌ఏలోనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువు భావించినా.. అతను హిందువుగా మిగలడని వ్యాఖ్యానించారు. వైవిధ్యాన్ని గౌరవించి, మానవత్వం, సోదరభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విశ్వశాంతి కోసం 30 దేశాలకు చెందిన మత నాయకులు ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు.

భారత డిఎన్‌ఏలోనే ఐక్యత-వైవిధ్యం.. అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
Rss Chief Mohan Bhagwat

Updated on: Aug 30, 2026 | 10:24 AM

అమెరికా పర్యటనలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో జరిగిన మల్టీ-ఫెయిత్ డైలాగ్‌లో హిందూ–ముస్లిం సంబంధాలు, హిందుత్వ భావనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువు భావించినా.. అతను హిందువుగా మిగలడంటూ పేర్కొన్నారు.. అమెరికాలోని న్యూయార్క్‌లో గల ప్రతిష్టాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్’ (AHEAD ఫోరమ్) ఆధ్వర్యంలో ఆగస్టు 29న విశ్వ ఏకత్వ వేడుక (Universal Oneness Celebration) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ కీలక ప్రసంగం చేశారు.

భారత డిఎన్‌ఏలోనే ఐక్యత-వైవిధ్యం

ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. “మనం అమెరికా గురించి మాట్లాడేటప్పుడు ‘బహుళత్వం’ (Pluralism) అనే పదాన్ని ఎక్కువగా వింటాం. కానీ, భారత్ గురించి చర్చించేటప్పుడు ‘భిన్నత్వంలో ఏకత్వం’ (Unity in Diversity) అనే పదం గుర్తుకువస్తుంది. భారత్‌ను ఒక భౌగోళిక ప్రాంతంగా మాత్రమే చూడలేం. ఈ భిన్నత్వం, ఐక్యత రెండూ భారతీయ డిఎన్‌ఏలోనే భాగమయ్యాయి. ఈ విశ్వంలో ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన లక్ష్యముంటుంది” అని పేర్కొన్నారు.

స్వామి వివేకానంద మాటలను గుర్తుచేస్తూ.. జగత్తుకు ఐక్యతా సందేశాన్ని అందించడం, ఆ సూత్రాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే భారత్ అసలు లక్ష్యమని ఆయన అన్నారు. “మనమంతా ఒక్కటే. వైవిధ్యం అనేది మన ఏకత్వానికి ఒక అలంకారం వంటిది. అందుకే వైవిధ్యాన్ని గౌరవించాలి, అంగీకరించాలి, జరుపుకోవాలి” అని పిలుపునిచ్చారు.

రాక్షస ప్రవృత్తి vs మానవత్వ ధర్మం

సమాజంలో ఉన్న రెండు రకాల ధోరణుల గురించి మోహన్ భాగవత్ వివరిస్తూ..

స్వార్థ పూరిత ధోరణి (రాక్షస ప్రవృత్తి): “మా మాట వింటేనే రక్షణ కల్పిస్తాం” అని షరతులు విధించే ధోరణి. సంస్కృతంలో రక్షణను ‘రక్ష’ అంటారు. తమను లొంగదీసుకునే వారిని మాత్రమే రక్షించేవారు రాక్షసులు.

మానవత్వ ధోరణి (ధర్మం): అభిప్రాయాలు, ఉపయోగాలతో సంబంధం లేకుండా అందరినీ మానవులుగా చూస్తూ, సోదరభావంతో మెలగడమే నిజమైన మానవత్వం.

అంతర్గతంగా ఉన్న ఏకత్వ భావనే ధర్మమని, అది అందరినీ ఏకం చేస్తుందే తప్ప విడదీయదని మోహన్ భగవత్ అన్నారు.

పర్యావరణ స్పృహ – సమాజానికి తిరిగివ్వడం

ప్రకృతి మరియు సమాజం పట్ల మన బాధ్యతలను గుర్తుచేస్తూ.. “మనం తినే ఆహారం రైతుల శ్రమ వల్ల, వేసుకునే బట్టలు కార్మికుల కష్టం వల్ల వస్తున్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరికీ మనం రుణపడి ఉన్నాం. అందుకే తిరిగి సమాజానికి సేవ చేయడం మన బాధ్యత” అని చెప్పారు. ప్రపంచంలో స్థిరపడిన భారతీయులు తమ కర్మభూమి పట్ల విధేయతతో ఉంటూనే, జన్మభూమి విలువలను పాటించాలని ఆకాంక్షించారు.

విశ్వ శాంతి కోసం 5 సూత్రాల కార్యాచరణ

మోహన్ భాగవత్ ప్రసంగానికి ముందు, ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుండి విచ్చేసిన 180 మంది మత నాయకులు ఒక ప్రతిజ్ఞను స్వీకరించారు. ‘వన్ వరల్డ్ – వన్ హ్యూమానిటీ’ (ఒకే ప్రపంచం – ఒకే మానవత్వం) పేరిట 5 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. మతం పేరుతో ద్వేషం, హింసను ప్రేరేపించడాన్ని ప్రపంచ మత నాయకులు ముక్తకంఠంతో ఖండించారు.

ఈ సదస్సు ప్రారంభంలో ‘రక్షా బంధన్’ వేడుకలను నిర్వహించారు. పాల్గొన్న ప్రతినిధులందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకుని తమ ఏకత్వాన్ని చాటుకున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో 39 రాష్ట్రాలు, 850 అమెరికన్ నగరాలు, 29 దేశాలకు చెందిన దాదాపు 6,000 మంది ప్రతినిధులు, 250 ఆధ్యాత్మిక-సామాజిక సంస్థలు భాగస్వామ్యమయ్యాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us