వీడని లోహస్తంభాల మిస్టరీ, మొన్న అమెరికాలోని రెడ్‌రాక్‌ ఎడారిలో.. నిన్న రుమేనియాలోని ప్రాచీన కట్టడాల ప్రాంతంలో…

|

Dec 02, 2020 | 1:31 PM

జన సంచారం లేని ప్రాంతాలలో ఆకస్మాత్తుగా లోహస్తంభం ప్రత్యక్షం కావడం, అంతే హఠాత్తుగా అది మాయం కావడం, మరో చోట అదే తరహా స్తంభం దర్శనమివ్వడం.. ఏమిటో అంతా వింతగానూ విచిత్రంగానూ ఉంది..

వీడని లోహస్తంభాల మిస్టరీ, మొన్న అమెరికాలోని రెడ్‌రాక్‌ ఎడారిలో.. నిన్న రుమేనియాలోని ప్రాచీన కట్టడాల ప్రాంతంలో...
Follow us on

జన సంచారం లేని ప్రాంతాలలో ఆకస్మాత్తుగా లోహస్తంభం ప్రత్యక్షం కావడం, అంతే హఠాత్తుగా అది మాయం కావడం, మరో చోట అదే తరహా స్తంభం దర్శనమివ్వడం.. ఏమిటో అంతా వింతగానూ విచిత్రంగానూ ఉంది.. ప్రపంచ పరిశోధకులే ఏమిటీ వింత అని తలలు పట్టుకుంటున్నారు.. కాసింత కంగారు కూడా పడుతున్నారు.. ఇంకొంచెం ఆందోళన కూడా చెందుతున్నారు.. ఎవరు చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో, దాని వల్ల ప్రయోజనం ఏమిటో ఎవరికీ తెలియడం లేదు.. కొంపతీసి గ్రహాంతరవాసుల పని కాదు కదా అన్న అనుమానమూ కొందరికి కలుగుతోంది. ఎందుకంటే అంత బరువైన లోహస్తంభాన్ని జనసంచారం ఏమాత్రం లేని చోటుకు తరలిండచం అసాధ్యం కాదు కానీ కష్టంతో కూడుకున్న పని! స్తంభాన్ని నిలువుగా పాతిపెట్టడం కూడా శ్రమతో కూడున్న వ్యవహారం.. అమెరికాలోని ఉటాలో ఉన్న రెడ్‌రాక్‌ ఎడారిలో మొన్నటికి మొన్న నిలువునా పాతి ఉంచిన లోహస్తంభాన్ని గుర్తించారు.. గొర్రెలను లెక్కించేందుకు వన్యప్రాణి విభాగంవారు నవంబర్‌ 18న సర్వే చేస్తుండగా జనసంచారం ఏమాత్రం లేని ఆ ఎడారిలో పాతి ఉన్న ఓ లోహ స్తంభాన్ని కనుగొన్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత అది హఠాత్తుగా మాయమయ్యింది.. ఎవరో దాన్ని తవ్వి తీసుకెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఆ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే యూరప్‌లోని రొమేనియాలో అలాంటి స్తంభమే కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. కాకపోతే ఈసారి ఎడారిలో కాకుండా ప్రాచీన కట్టడాలు ఉన్న ప్రాంతంలో ఆ లోహ స్తంభం కనిపించింది.. పెట్రోడోవా కేసియన్‌ కోటకు కొన్ని మీటర్ల దూరంలో త్రిభుజాకార లోహ స్తంభం వెలిసింది.. ఉటాలో ఆకస్మాత్తుగా కనిపించిన లోహస్తంభం మాదిరిగానే ఇది కూడా ఉండటంతో పరిశోధకులలో ఆసక్తి పెరిగింది. కాకపోతే ఆకారాలలో కొన్ని తేడాలున్నాయంతే! ఉటాలోని ఒంటిస్తంభం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేసినదైతే రొమేనియాలోని స్తంభం మాత్రం అద్దంలా ఉంది.. దానిపై అర్థంకాని ఏవో రాతలు కూడా ఉన్నాయి.. అసలు ఆ స్తంభం అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకుంటున్నామని నీమ్ట్‌ కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ అధికారి రోక్సానా జోసా తెలిపారు.