Cyclone Gabrielle: 9 రాష్ట్రాల్లో నేషనల్ ఎమర్జెన్సీ.. 58 వేల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా.. అగ్నిమాపక సిబ్బంది గల్లంతు

|

Feb 14, 2023 | 5:05 AM

గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు, వాటికి తోడు కుంభవృష్ణి వెరసి న్యూజీలాండ్‌ను వణకిస్తున్నాయి. ఈ ఒక్కరాత్రి గడిస్తే చాలు అనుకుంటోంది న్యూజీలాండ్ ప్రభుత్వం. ప్రజలంతా అప్రమత్తంగా..

Cyclone Gabrielle: 9 రాష్ట్రాల్లో నేషనల్ ఎమర్జెన్సీ.. 58 వేల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా.. అగ్నిమాపక సిబ్బంది గల్లంతు
Cyclone Gabrielle
Follow us on

గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు, వాటికి తోడు కుంభవృష్ణి వెరసి న్యూజీలాండ్‌ను వణకిస్తున్నాయి. ఈ ఒక్కరాత్రి గడిస్తే చాలు అనుకుంటోంది న్యూజీలాండ్ ప్రభుత్వం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. గాబ్రియెల్ తుపాను న్యూజీలాండ్‌ దేశాన్ని వణికిస్తోంది. అక్లండ్, నార్త్‌ల్యాండ్, కోరమండల్, బే ఆఫ్ ప్లెంటీ సహా 9 రాష్ట్రాల్లో నేషనల్ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు న్యూజీలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరహా ఎమర్జెన్సీ ప్రకటించడం న్యూజీలాండ్ చరిత్రలో ఇది మూడోసారి. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ విపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరించింది. ఇప్పటి వరకు నార్త్‌ల్యాండ్‌లో 58 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పునరుద్ధరించేందుకు సుమారు వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపినట్టు న్యూజీలాండ్ మీడియా చెబుతోంది. అక్లండ్‌లోని ఓ భవనం కుప్పకూలిన ఘటనలో ఓ ఫైర్ ఫైటర్ గల్లంతయ్యారు.

లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు

పలు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చెయ్యాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ అత్యవసర పరిస్థితుల్లో తమ వెంట ఏ ఏ వస్తువులు తీసుకెళ్లాలో జాతీయ విపత్తుల నిర్వహణ వ్యవస్థ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తోంది. అక్లండ్‌లో ముందు జాగ్రత్తగా 50 అపార్మెంట్లలోని కుటుంబాలను ఖాళీ చేయించారు. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అవి ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాటిల్లో 109 ఏళ్ల క్రితం నిర్మించిన మౌంట్ ఎడిన్ స్టీల్ టవర్ కూడా ఉంది.

న్యూజీలాండ్‌లో 3 వంతు ప్రజలపై గాబ్రియెల్ ప్రభావం

గాబ్రియెల్ తుపాను ప్రభావం న్యూజీలాండ్‌ జనాభాలో సుమారు మూడోవంతు మందిపై ఉండబోతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వందలాది విమానాలను రద్దు చేశారు. పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. తుపాను ప్రభావం సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉండబోతోందని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

గాబ్రియెల్ తుపాను ప్రభావంతో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం చెట్లు కూలిపోయాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థ స్తంభించింది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాల కారణంగా అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి. అలాగే అత్యవసర సేవలందించే సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని జాతీయ విపత్తుల నిర్వహణ అధికారి తెలిపారు. ఓ వైపు తుపాను ముప్పు కొనసాగుతుండగానే మరోవైపు న్యూజీలాండ్‌ను భూకంపం వణికించింది. రిక్టర్‌ స్కేలుపై 6.1గా భూకంప తీవ్రత నమోదయ్యిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి