సైబర్‌ నేరగాళ్లపై డెత్ వారెంట్.. ఏకంగా 11 మందికి మరణశిక్ష అమలు.. ఎక్కడంటే..?

సైబర్ నేరాలు, మోసాలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న అదిపెద్ద సమస్యలు...! అయితే 11 మందికి మరణశిక్ష అమలు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది చైనా. ఆగ్నేయాసియాలో వేళ్లూనుకుని ఉన్న సైబర్ క్రైమ్ ముఠాలకు ఈ మరణశిక్షలు.. గట్టి హెచ్చరిక..! మన దేశంలోనూ ఈ 'సైబర్ రాక్షసుల' పట్ల కఠిన చట్టాలు రాబోతున్నాయా?

సైబర్‌ నేరగాళ్లపై డెత్ వారెంట్.. ఏకంగా 11 మందికి మరణశిక్ష అమలు.. ఎక్కడంటే..?

Updated on: Jan 30, 2026 | 8:12 AM

సైబర్ నేరాలు, మోసాలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న అదిపెద్ద సమస్యలు…! అయితే 11 మందికి మరణశిక్ష అమలు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది చైనా. ఆగ్నేయాసియాలో వేళ్లూనుకుని ఉన్న సైబర్ క్రైమ్ ముఠాలకు ఈ మరణశిక్షలు.. గట్టి హెచ్చరిక..! మరి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అమాయకులను ముంచుతున్న అంతర్జాతీయ ముఠాల వేటలో భారత్ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? చైనా తరహాలోనే మన దేశంలోనూ ఈ ‘సైబర్ రాక్షసుల’ పట్ల కఠిన చట్టాలు రాబోతున్నాయా? సైబర్ నేరగాళ్ల పాలిట భారత్ కూడా ‘యముడు’గా మారబోతుందా..?” ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననిపిస్తుంది.

సోషల్ మీడియా స్నేహాల పేరుతో అమాయకులను ముంచేస్తున్న ఒక అంతర్జాతీయ ముఠాను ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ టీమ్ ఎట్టకేలకు ఛేదించింది. ఒక నైజీరియన్ పౌరుడు సూత్రధారిగా వ్యవహరిస్తున్న ఈ ముఠా, ఖరీదైన బహుమతులు, విదేశీ కరెన్సీ ఆశచూపి లక్షలాది రూపాయలు కాజేస్తోంది. ఢిల్లీలోని బురారికి చెందిన ఒక మహిళను నమ్మించి, కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జీల పేరుతో రూ. 4.20 లక్షలు వసూలు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరాలు, మోసాలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ప్రధానమైనవి.

ఎక్కడో, ఏ దేశంలోనో ఉండి.. మారుమూలన ఉన్న వారి దగ్గరి నుంచి క్షణాల్లో కోట్ల రూపాయలను కొట్టేసి.. దర్జాగా దొరకకుండా తిరుగుతున్న సైబర్ కేటుగాళ్ల పనిపట్టేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ఒకవైపు.. సైబర్ దాడులు జరగకుండా చూడటమే కాకుండా.. సైబర్ మోసాలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు అనేక ఆపరేషన్లు చేస్తున్నాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ డిజిటల్ ముఠాకు అడ్డుకట్ట ఎప్పుడు..? శిక్ష ఏంటి అన్నదే ప్రశ్న. ఈ క్రమంలోనే చైనా సంచలన ప్రకటన విడుదల చేసింది. రూ.11,500 కోట్ల భారీ సైబర్ నేరాలకు పాల్పడ్డ ముఠాను పట్టుకుంది. వారిలో ఓ కుటుంబం సహా 11 మందికి మరణశిక్షలు అమలు చేసి.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఉత్తర మయన్మార్‌లో ఇంటర్నెట్‌ స్కామ్‌లు, వ్యభిచారం, మాదకద్రవ్యాల రవాణాలో కొన్ని కుటుంబాలు ఆరితేరాయి. ఇందులో మింగ్‌ ఫ్యామిలీ సహా నాలుగు కుటుంబాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా వీరి ఆగడాలపై అనేక ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన చైనా అధికారులు.. పలు కుటుంబాలను అదుపులోకి తీసుకున్నారు. 2025 సెప్టెంబర్ జెజియాంగ్‌ కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దాన్ని తాజాగా అమలు చేశారు. హత్య, నేరం, అక్రమ నిర్బంధం, గ్యాంబ్లింగ్‌ వంటి 14 రకాల నేరాలలో వీరు దోషులుగా తేలడంతో వీరికి మరణశిక్ష విధించారు. ఆగ్నేయాసియాలో వేళ్లూనుకుని ఉన్న సైబర్ క్రైమ్ ముఠాలకు ఈ మరణశిక్షలు.. గట్టి హెచ్చరిక అని చైనా అధికారులు తెలిపారు.

విదేశాల్లో కూర్చుని భారతీయుల సొమ్మును దోచుకుంటున్న సైబర్ ముఠాలపై భారత్ కూడా ఇప్పటికే “డిజిటల్ స్ట్రైక్” ప్రారంభించింది. లక్షలాది నకిలీ సిమ్ కార్డులను బ్లాక్ చేయడం, బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడం, అంతర్జాతీయ ఆపరేషన్లతో నేరగాళ్ల వేట కొనసాగిస్తోంది. అయితే, చైనా మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, మరణశిక్షలు అమలు చేసి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. మన దేశంలోనూ సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ఈ సైబర్ రాక్షసుల పట్ల చట్టాలు మరింత కఠినం కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం ఆర్థిక నేరాల్లో మరణ శిక్ష అత్యంత అరుదైన చర్యే అయినప్పటికీ, దేశ ప్రజల ఆర్థిక భద్రతను దెబ్బతీస్తున్న వారి విషయంలో భారత్ నెక్ట్స్‌ స్టేప్‌ ఏంటి..? రాబోయే రోజుల్లో సైబర్ నేరగాళ్ల పాలిట భారత్ కూడా ‘యముడిగా’ మారుతుందా? చైనా తరహాలోనే ఆ ముఠాల ప్రాణాలు తీసే సంచలన నిర్ణయం వైపు మన దేశం అడుగులు వేస్తుందా? వేచి చూడాలి!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..