
Baby born to covid patient have more anti bodies: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ వైరస్‌ను ఎదుర్కోవడం కష్టమనే సమయంలో ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ వస్తుందన్న ఆశ ప్రజల్లో చిగురిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సింగపూర్ చెందిన ఓ పరిశోధన సంస్థ కొవిడ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. కరోనా వైరస్ సోకిన గర్భిణులు తీవ్ర ఆందోళనకు గురైన విషయం మనందరం చూసిందే. ఎక్కడ తమ కడుపులో ఉన్న బిడ్డకు వైరస్ సోకుతుందోనని భయపడ్డారు.
అయితే సింగపూర్ గైనకాలజీ పరిశోధన సంస్థ చేపట్టిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ సోకిన గర్భిణులు ప్రసవించిన శిశువుల్లో .. వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ చిన్నారుల్లో యాంటీ బాడీలు ఉన్నా అవి ఏ మేరకు వైరస్‌ను అడ్డుకోగలవనే విషయాన్ని మాత్రం పరిశోధకలు చెప్పలేకపోతున్నారు. సర్వేలో భాగంగా పరిశోధకులు 16 మంది గర్భిణుల సమాచారాన్ని సేకరించారు. వారిలో అయిదుగురు బిడ్డలకు జన్మనివ్వగా ఆ అయిదుగురు చిన్నారుల్లో యాంటీ బాడీలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే పిల్లలు ఎదుగుతున్నా కొద్దీ.. వారిలో ఉన్న యాంటీబాడీలు తగ్గుతాయా లేదా అన్న కోణంలో వైద్యులు పరిశోధిస్తున్నారు.