China: భారత విద్యార్థుల రాకకు అనుమతిస్తున్నాం.. చైనా విదేశాంగ శాఖ ప్రకటన

|

Apr 29, 2022 | 9:05 PM

కరోనా(Corona) కారణంగా స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు తిరిగి తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు చైనా(China) వెల్లడించింది. రెండేళ్ల క్రితం ప్రబలిన కొవిడ్ కారణంగా చైనా నుంచి అనేక మంది భారత విద్యార్థులు....

China: భారత విద్యార్థుల రాకకు అనుమతిస్తున్నాం.. చైనా విదేశాంగ శాఖ ప్రకటన
medical Students
Follow us on

కరోనా(Corona) కారణంగా స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు తిరిగి తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు చైనా(China) వెల్లడించింది. రెండేళ్ల క్రితం ప్రబలిన కొవిడ్ కారణంగా చైనా నుంచి అనేక మంది భారత విద్యార్థులు స్వదేశానికి వచ్చారు. అప్పటి నుంచి వీసా, ఇతర ఆంక్షల కారణంగా ఇండియాలో(India) నే ఉండిపోయారు. ఈ మేరకు వారంతా చైనాకు వచ్చి తమ చదువును కొనసాగించవచ్చని ఆ దేశ విదేశాంగ శాఖ వివరించింది. భారత విద్యార్థులను అక్కున చేర్చుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని, ఇతర దేశాల విద్యార్థుల అనుభవాలను భారత అధికారులకు తెలియజేశామని చైనా అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా ఉన్న కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విదేశీ విద్యార్థుల రాకపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో అన్నారు. చైనా ప్రకటనతో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. చైనాకు తిరిగి వెళ్లాలనుకునే విద్యార్థుల వివరాలను సేకరించేలా చర్యలు చేపట్టింది. మే 8వ తేదీలోగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. అనుమతులు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్‌ విధివిధానాలను పాటించాలని స్పష్టం చేసింది.

కరోనా పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో 2019 డిసెంబరులో తీవ్ర విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొవిడ్ వ్యాప్తి తగ్గింపునకు కఠిన ఆంక్షలు విధించింది. విదేశీ ప్రయాణాలు నిలిపివేసింది. దీంతో భారత్.. ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి, అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. చైనాలో చదువుకునేందుకు వెళ్లిన దాదాపు 23 వేలకు పైగా విద్యార్థులు తిరిగి భారత్‌కు చేరుకున్నారు. వీరిలో చాలా మంది వైద్య విద్య చదువుతున్నవారే. అయితే వైరస్‌ ఉద్ధృతి తగ్గిన తర్వాత వీరు తమ చదువులు కొనసాగించేందుకు తిరిగి చైనా వెళ్లాలనుకున్నా.. డ్రాగన్ దేశం ఆంక్షల కారణంగా అది వీలుపడలేదు.

పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక లాంటి కొన్ని దేశాల నుంచి విద్యార్థులు తిరిగి చైనా వచ్చేందుకు చైనా ప్రభుత్వం ఇటీవలే అనుమతినిచ్చింది. తాజాగా కొంతమంది భారత విద్యార్థులు తిరిగొచ్చేందుకు అనుమతులు కల్పిస్తామని చెబుతూ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు.. గత కొన్ని రోజులుగా చైనాలో మళ్లీ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా షాంఘైలో రోజుకు పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్‌ కట్టడిలో భాగంగా డ్రాగన్ కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. బీజింగ్‌లో పాఠశాలలను మూసివేసింది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీచదవండి

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..