
కాంగో: కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందగా.. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగోలోని కసాయ్ ప్రావిన్స్‌లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు తప్పడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని బోగీలు పక్కనే ఉన్న నదిలో పడ్డాయని అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. కాగా ఒక నెల వ్యవధిలో ఇది మూడో రైలు ప్రమాదమని రైల్వే విభాగం తెలిపింది. గత నెలలో జరిగిన ఓ ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్లు తెలిపారు.