మయన్మార్ లో సైనిక కుట్రను నిరసిస్తూ రెండో రోజైన ఆదివారం లక్షలాది ప్రజలు వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఇటీవల ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని సైనికులు నిర్బంధించి దేశంలో అధికార పగ్గాలను చేబట్టారు. మళ్ళీ దేశంలో సైనిక పాలన మొదలైంది. అయితే ఆంగ్ సాన్ సూకీని వెంటనే విడుదల చేయాలని కోరుతూ, సైనిక పాలనను వ్యతిరేకిస్తూ లక్షలాది మంది వీధుల్లో పోటెత్తారు. వీరిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరైనా గాయపడ్డారా లేదా మరణించారా అన్న విషయం తెలియలేదు. గత నవంబరులో దేశంలో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది.
కానీ ఆ ఎన్నిక ఫ్రాడ్ అని సైన్యం ఆరోపిస్తోంది. కాగా జస్టిస్ ఫర్ మయన్మార్, మాకు సైనిక నియంతల పాలన వద్దు అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. సూకీ విడుదలను కోరుతూ తాము తదివరకూ పోరాడుతామని అనేకమంది నినాదాలు చేశారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన సూకీ లోగడ సుమారు 15 ఏళ్లపాటు జైల్లో గడిపారు. ప్రజాస్వామ్య యుతంగా తాము ఎన్నికల్లో గెలిచామని ఆమె అంటున్నారు. అయితే గతంలో కూడా మయన్మార్ లో సైనిక కుట్రలు జరిగి మిలిటరీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. తాజాగా ఈ దేశంలో ఈ ఆందోళన మరికొన్ని వారాలు జరిగినా జరగవచ్చునంటున్నారు.
Also Read:
రైతుల సమస్యపై వారి ట్రోలింగ్ కి కారణం కేంద్రమే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ థాక్రే