
అమెరికాలో చదువుతున్న భారతీయులతో సహా లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపే కీలక వలస నిబంధనను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానానికి ముగింపు పలికి, విద్యార్థులకు నిర్దిష్ట కాలపరిమితితో అమెరికాలో ఉండే విధానాన్ని తీసుకురావాలని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిర్ణయించింది.
ప్రస్తుతం F-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు, వీసా నిబంధనలు పాటిస్తూ అమెరికాలో ఉండే అవకాశం ఉంది. దీనినే ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’గా పిలుస్తారు. అయితే కొత్త నిబంధన ప్రకారం, F-1 విద్యార్థులకు సాధారణంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఆ గడువులోగా కోర్సు పూర్తికాకపోతే, విద్యార్థులు అదనపు సమయం కోసం DHS వద్ద ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కొత్త విధానం కేవలం F-1 విద్యార్థులకే కాకుండా, J-1 ఎక్స్‌ఛేంజ్ విజిటర్లు, విదేశీ మీడియా ప్రతినిధులకు జారీ చేసే I వీసాలపై కూడా ప్రభావం చూపనుంది. వీసా వ్యవస్థపై పర్యవేక్షణ పెంచడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడమే ఈ మార్పుల ఉద్దేశమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా డాక్టరేట్, పరిశోధన ఆధారిత కోర్సులు, మెడికల్ ట్రైనింగ్, ప్రత్యేక సాంకేతిక రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు నాలుగేళ్ల పరిమితి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు అతిపెద్ద వర్గంగా ఉన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో 3.31 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరు మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 30 శాతం ఉన్నారు. కొత్త నిబంధన అమల్లోకి వస్తే, నాలుగేళ్లలో తమ విద్యను పూర్తి చేయలేని భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే, వారి చట్టపరమైన నివాస స్థితిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడువు ముగిసేలోపు పొడిగింపు పొందలేకపోతే విద్యార్థులు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలనా ఆలస్యాలు, పత్రాల సమస్యలు కూడా విద్యార్థులకు ఇబ్బందులు కలిగించవచ్చని చెబుతున్నారు.
అయితే ఈ నిబంధన వెంటనే అమల్లోకి రాదు. ముందుగా కాంగ్రెస్ సమీక్షకు వెళ్లాల్సి ఉంటుంది. అధికారిక అమలు తేదీ ప్రకటించే వరకు ప్రస్తుత ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానం కొనసాగుతుంది. ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ మార్పు మరో కీలక నిర్ణయంగా మారింది. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు, భవిష్యత్తులో అక్కడ చదువుకోవాలని భావిస్తున్న వారికి ఈ పరిణామం అత్యంత కీలకంగా మారనుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..