
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు జరిగిన అనంతరం అమెరికా ఇరాన్‌పై భారీ సైనిక చర్యలకు దిగింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. మంగళవారం నిర్వహించిన ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా కేంద్రాలు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి స్థావరాలు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి కేంద్రాలు, డ్రోన్ లాంచ్ సైట్లు, ఓడరేవు సదుపాయాలపై దాడులు నిర్వహించింది. బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు నగరాలు, ఖేష్మ్ ద్వీపం ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. మొత్తం 80 టార్గెట్లపై అమెరికా దాడి చేసినట్లు తెలుస్తోంది.
U.S. Central Command forces have begun launching a series of powerful strikes against Iran to impose heavy costs for targeting and attacking commercial shipping crewed by innocent civilians in an international waterway. The U.S. strikes are in response to Iranian attacks on three…
— U.S. Central Command (@CENTCOM) July 7, 2026
ఈ పరిణామాలు గత నెల ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. హోర్ముజ్ జలసంధిలో మూడు ట్యాంకర్లపై జరిగిన దాడికి ఇరాన్ బాధ్యత వహించాలంటూ అమెరికా ఆరోపిస్తుండగా, అమెరికా సైనిక చర్యలు ఒప్పంద ఉల్లంఘనేనని ఇరాన్ వాదిస్తోంది. ఇదిలా ఉండగా, ఇరాన్ చమురు అమ్మకాలపై విధించిన ఆంక్షలకు ఇచ్చిన మినహాయింపును అమెరికా ఉపసంహరించుకుంది. ఈ మినహాయింపు ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా ఉండేది. ఈ నిర్ణయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది మాట్లాడుతూ.. అమెరికా చర్యలు ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంలోని కీలక నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోపించారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిలో సాధారణ రాకపోకలను పునరుద్ధరించడం, ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ, అలాగే ప్రాంతీయ ఘర్షణలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కొనసాగుతున్న దౌత్య చర్చలపై కూడా ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి