Taliban Luxury camp: నిరంతరం కొండల్లో గుట్టల్లో లోయల్లో ఇసుక దిబ్బల్లో నివసించిన తాలిబన్లకు ఓ ఇంద్రభవనం అప్పనంగా దక్కింది..అది ఇంద్రభవనమంటే ఇంద్రభవనమే! పెద్ద పెద్ద గదులు, హంసతూలిక తల్పాలు, ఖరీదైన ఫర్నీచర్, షాండిలైర్స్, విద్యుత్ వెలుగులు, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఫారిన్ లిక్కర్‌తో కూడిన చిన్నసైజు బార్.. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంద్రభవనం కాక మరేమిటి? అలాంటి అద్భుతమైన ప్యాలెస్ ఇప్పుడు అఫ్గానిస్తాన్ తాలిబన్ల చేతిలో చిక్కింది. తాలిబన్ల భయానికి ఆ ప్యాలెస్ యజమాని పారిపోతే తాలిబన్లు దాన్ని ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు అందులో ఓ 150 మంది తాలిబన్ సభ్యులు ఉంటున్నారు. ఆ భవనం యజమాని ఎవరనుకుంటున్నారు? అఫ్గానిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తమ్! ఆయనదే ఈ నివాసం.
67 ఏళ్ల అబ్దుల్ రషీద్ దోస్తమ్‌కు తాలిబన్లంటే అసలు పడదు.. ఇతడి పేరు వింటేనే తాలిబన్లు కోపంతో ఊగిపోతారు.. ఒకప్పుడు పారా ట్రూపర్‌గా, కమ్యూనిస్టు కమాండర్‌గా ఉన్న దోస్తమ్ కొంతకాలం పాటు ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2001లో రెండు వేల మందికిపైగా తాలిబన్ ముఠా సభ్యలను హతమార్చాడు. కంటెయినర్లలో బంధించి ఎడారిలో వదిలి వేసేవాడట. ఊపిరాడక వారంతా చనిపోయేవారట! అలా అని ఈయన గురించి చెప్పుకుంటుంటారు.
మొన్నటి వరకు హాయిగానే ఉన్నారు దోస్తమ్! ఎప్పుడైతే అమెరికా దళాలు అఫ్గానిస్తాన్ నుంచి నిష్క్రమించాయో.. ఎప్పుడైతే తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకున్నరో అప్పట్నుంచే ఈయనకు కష్టాలు మొదలయ్యాయి. తాలిబన్లకు దొరికితే చంపేస్తారని తెలుసు. అందుకే ప్రాణప్రదమైన ప్యాలెస్‌ను వదిలిపెట్టేసి ప్రాణాలు అరచేత పట్టుకుని ఉజ్బెకిస్తాన్‌కు పారిపోయాడు దోస్తమ్. ఆయన వెళ్లిపోయాక సకల వసతులు ఉన్న ఆ ఇంధ్రభవనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడా ప్యాలెస్‌లో తాలిబన్లలోని శక్తివంతమైన కమాండర్లలో ఒకరైన కారీ సలాహుద్దీన్ అయౌబీ ఉంటున్నారు. ఆయన భద్రతా సిబ్బంది కూడా అందులోనే ఉంటున్నారు. ఆ భవనంలో నివాసం అయితే ఉంటున్నాం కానీ లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడమోమని అయౌబీ అంటున్నారు.
ఆ సంగతి వదిలేస్తే తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అమెరికా బలగాలు, అఫ్గానిస్తాన్ సైనికులకు దొరక్కుండా చాలా ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. అమెరికా సైనికుల కళ్లు గప్పి కాలబూల్‌లోనే ఉన్నానని, దేశమంతా తిరిగానని చెప్పుకొచ్చాడు. తన జాడ పసిగట్టడానికి అమెరికా బలగాలు స్థానికులకు డబ్బులు కూడా ఇచ్చేవని అన్నాడు. తాను ఎప్పుడూ అఫ్గానిస్తాన్‌ను వదిలి వెళ్లాలనుకోలేదని చెప్పాడు.