Dubai: నదుల్లా మారిన దుబాయ్‌ రోడ్లు..

Updated on: Dec 22, 2025 | 6:13 PM

దుబాయ్, యూఏఈలలో అసాధారణ భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ఎడారి దేశంలో ఏకంగా 75 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ ఒక్కరోజులో ఏడాది వర్షం కురిసింది. విమానాశ్రయాలు, రోడ్లు నీట మునిగాయి, బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడింది. వాతావరణ మార్పులు, భూతాపమే ఈ విపత్తుకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

ఎడారిలో ఎప్పుడైనా నాలుగు చినుకులు పడటమే పెద్ద విశేషం.. అలాంటిది.. వర్షం నాన్‌స్టాప్‌గా కుమ్మేస్తే… వరద ఉప్పెనలా ముంచేస్తే… దుబాయ్లో అదే జరిగింది. దుబాయ్‌ సహా పలు దేశాల్లో హైఅలర్ట్‌ ప్రకటించాల్సి వచ్చింది. అత్యవసరమైతే తప్ప గడపదాటొద్దంటూ హెచ్చరికలు చేయాల్సి వచ్చింది. వడగండ్లతో పాటు కురిసిన హిమపాతంతో ఎడారి దేశాలు వణికిపోయాయి. ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే రోడ్లు నడుంలోతు నీళ్లలో మునిగిపోయాయి. చినుకు పడితే బాగుంటుందనుకునే ఎడారి దేశాలు ఇప్పుడు కంటిమీద కునుకులేకుండా అల్లాడుతున్నాయి. ఎండ మాడగొట్టే ఎడారి దేశాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. యూఏఈ, ఖతార్‌లో భారీ వర్షాలతో దుబాయ్, అబుదాబి నగరాలు నీట మునిగాయి. కొన్ని గంటల వ్యవధిలోనే ఆకాశానికి చిల్లులు పడినట్లు వర్షంపడింది. ఏడాదికి సరిపడా వర్షం ఒకేరోజు కురవడంతో జనజీవనం స్తంభించింది. రాస్ అల్ ఖైమాలో గోడ కూలి 27 ఏళ్ల భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షాలతో రోడ్లు, ఎయిర్‌పోర్టులు చెరువులను తలపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో వేలమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నా వరద ముప్పు ఇంకా తప్పలేదు. విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. దుబాయ్‌లో విలాసవంతమైన భవనాలు, మాల్స్ వరద నీటితో నిండిపోయాయి. మెట్రో స్టేషన్లలోకి నీరు చేరడంతో సర్వీసులు నిలిచిపోయాయి. రోడ్ల మీద కార్లు నీళ్లలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అబుదాబిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఖతార్ రాజధాని దోహాలో భారీ వర్షాలతో విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. వర్షం కురుస్తున్న సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫాను పిడుగు తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుర్జ్‌ ఖలీఫాపై పిడుగు పడిన దృశ్యాన్ని స్వయంగా సౌదీ యువరాజు షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ షేర్‌ చేసుకున్నారు. భారీ వర్షం కురుస్తుండగా, ఉరుములు మెరుపుల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్‌ ఖలీఫా పైభాగాన్ని తాకింది. ప్రజల భద్రత దృష్ట్యా పలు ఎమిరేట్లు ప్రజలు సందర్శించే బహిరంగ ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశాయి. యూఏఈ అంతటా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు శుక్రవారం ఉద్యోగులకు రిమోట్ వర్క్ అమలు చేశాయి. పలు విమానాలు ఆలస్యమయ్యాయి. బస్సు సర్వీసులకు కూడా తాత్కాలికంగా రద్దుచేశారు. అల్ బషాయర్ అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్‌ ఇచ్చారు. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా దుబాయ్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఆ సమయంలో కేవలం 24 గంటల్లోనే 250 మిల్లీమీటర్ల వర్షం నమోదై 75 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టేసింది. సాధారణంగా గల్ఫ్ దేశాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. కానీ కొంతకాలంగా ఇక్కడ వాతావరణం అనూహ్యంగా మారుతోంది. భూతాపం పెరగడంతో గాలిలో తేమ శాతం పెరిగి మేఘాలు వేగంగా వర్షిస్తున్నాయి. వాతావరణ మార్పులతో హిందూ మహాసముద్రం వేడెక్కుతుండటమే ఈ అసాధారణ వర్షాలకు కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ఎడారి ప్రాంతాల్లో ఇలాంటి విపత్తులు సంభవించడం భవిష్యత్తులో పెను ముప్పుకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతిలో వస్తున్న మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి విపత్తులు తరచూ సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..

రెండు నెలల ఆపరేషన్‌ సక్సెస్‌.. బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌

అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే

T20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆటగాళ్లు వీరే

అర్ధరాత్రి కారు బీభత్సం.. ఆ తర్వాత

Published on: Dec 22, 2025 06:13 PM