10 వేల అడుగులా.. 45 నిమిషాల వ్యాయామమా.. ఫిట్‌నెస్‌ కోసం ఏది బెస్ట్‌ ??

Updated on: Jan 12, 2026 | 5:28 PM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. రోజుకు 10 వేల అడుగులు నడవడం లేదా 45 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. నడక జీర్ణశక్తి, గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. వ్యాయామం వేగంగా బరువు తగ్గించి కండరాలను బలంగా చేస్తుంది. మీ లక్ష్యాలను బట్టి దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు, లేదా రెండూ కలిపి సంపూర్ణ ఫిట్‌నెస్ సాధించవచ్చు. నిరంతర కృషి కీలకం.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ చాలా అవసరం. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ తక్కువ మానసిక శ్రమ ఎక్కువ అయిపోయింది. ఏసీ రూముల్లో..కుర్చీలకు అతుక్కుపోయి గంటలతరబడి వర్క్‌లో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో సరైన ఆహారం తీసుకోవడానికే సమయం ఉండటంలేదు.. ఇంక వ్యాయామానికి సమయమెక్కడిది అంటే మన ఆరోగ్యం చేజేతులా పాడుచేసుకున్నవాళ్లం అవుతాం. అందుకే ప్రతి మనిషికి రోజూ వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి. దీనికోసం ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవాలని లేదంటే 45 నిమిషాలు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి వచ్చే అనుమానం.. ఈ రెండింట్లో ఏది చేస్తే మేలు అని. మరి దేని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. పది వేల అడుగులు.. ఇది చాలా సులభమైన వ్యాయామం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతో ఈజీగా చేయొచ్చు. రోజుకు 10 వేల అడుగులు నడవడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ, జీర్ణ వ్యవస్థ మెరుగవుతాయి. గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆలస్యమైనా బరువూ తగ్గుతారు. ఈ వ్యాయామం చేయడానికి ప్రత్యేకంగా ఎటువంటి పరికరాలు అవసరం లేదు. అయితే, 10 వేల అడుగులు అన్నారు కదా అని ఒకేసారి ఇంత దూరం నడవాల్సిన అసవరం లేదు. అడుగులను కొన్ని భాగాలుగా విడగొట్టి రోజులో వీలు కుదిరినప్పుడల్లా చేయొచ్చు. ఉదయం ఒక అరగంట లేదా గంట నడవడంతోనే సగానికిపైగా టార్గెట్‌ పూర్తి చేసుకోవచ్చు. ఆఫీసులో లిఫ్ట్‌ ఎక్కే బదులు మెట్లమార్గం ఎంచుకోవడం, గంటకోసారి కుర్చీలో నుంచి లేచి 10 నిమిషాలు నడవడం వంటివి చేయొచ్చు. రాత్రి భోజనం చేసిన తర్వాత మరో పావుగంట నడిచి లక్ష్యాన్ని పూర్తి చేయొచ్చు. అడుగులు లెక్కించడానికి స్మార్ట్‌వాచ్‌లు ఉన్నాయి. మొబైల్‌ఫోన్‌లోనూ ఈ అప్లికేషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ నడక వ్యాయామం వల్ల కొన్ని నష్టాలున్నాయి. నడకతోనే కండరాలు బలంగా మారవు. ఫిట్‌గా అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదీకూడా క్రమం తప్పకుండా నడక సాగించాలి. మధ్యలో ఆపేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. మొత్తం మొదటికొస్తుంది. అందుకే వ్యాయామం కూడా చేయాలి. 45 నిమిషాల వ్యాయామం… జిమ్‌లో వర్కౌట్స్‌, కార్డియో, సైక్లింగ్‌ వంటివి చేయొచ్చు. ఈ 45 నిమిషాల వ్యాయామంతో తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. దీంతో తొందరగా బరువు తగ్గే అవకాశముంది. శరీరంలోని కండరాలు దృఢంగా మారడంతోపాటు శక్తి లభిస్తుంది. ఫిట్‌గా ఉండటంతో మానసిక ప్రశాంతత పొందుతారు. చక్కటి నిద్ర పడుతుంది. ఉదయంగానీ, సాయంత్రం కానీ జిమ్‌కెళ్లి వ్యాయామాలు చేయొచ్చు. లేదంటే ఇంట్లోనే కార్డియో, యోగాసనాలు వంటివి చేయొచ్చు. సైక్లింగ్‌ చేస్తూ శరీరానికి శ్రమ కల్పించొచ్చు. అయితే, చాలా మందికి జిమ్‌కెళ్లి వ్యాయామం చేసేంత సమయం ఉండకపోవచ్చు. మరికొంత మందికి ఈ వ్యాయామాల వల్ల శక్తి లభించడం అటుంచితే రోజంతా అలసటగా అనిపిస్తుంటుంది. అలాగే ఈ వ్యాయామాలు ఎలా పడితే అలా చేయకూడదు. తేలిక పాటి వ్యాయామాల నుంచి క్రమంగా కఠిన వ్యాయామాలకు వెళ్లాలి.జిమ్‌లో అయితే ట్రైనర్‌ శిక్షణ ఇస్తారు. ఇంటి దగ్గరే చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో వ్యాయామాలకు సంబంధించి అనేక వీడియోలు, మొబైల్‌ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి సాయం తీసుకోవచ్చు. ఈ రెండింట్లో ఏది బెస్ట్‌ అనే విషయానికి వస్తే సాధారణ, నిలకడైన ఆరోగ్యం కోసం రోజూ 10వేల అడుగులు నడిస్తే సరిపోతుంది. అదే, కాస్త తొందరగా బరువు తగ్గాలి, కండరాలు దృఢంగా మారాలంటే 45 నిమిషాల వ్యాయామం ఉత్తమం. సంపూర్ణ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కావాలంటే రెండూ చేయొచ్చు. ఏం చేసినా, క్రమం తప్పకుండా చేస్తేనే ఫలితముంటుందని గుర్తుంచుకోవాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం

ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్‌ చూసి పరుగులు

వరి పొలం బురదలో దిగి.. నాట్లు వేసిన డిప్యూటీ కలెక్టర్ హరిణి

Yadadri: యాదాద్రిలో గుప్త నిధుల కలకలం

456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??