ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
గ్రామాలల్లో కోతుల దాడులు మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కోతుల గుంపు ఓ యువకుడిని ప్రాణాపాయస్థితిలోకి నెట్టేసాయి. కోతుల దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువకుడు బావిలో పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన విక్రమ్ రెండు చేతులూ విరిగిపోవడంతో రెండు గంటలకు పైగా నరకయాతన అనుభవించాడు. బావిలో పడ్డ అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఈ ఘటన జరిగింది. డిసి తండాకు చెందిన విక్రమ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వెళుతున్నాడు. వర్ధన్నపేట శివారులోని ధాన్యం విక్రయ కేంద్రం వద్ద అతనిపై కోతులు మూకుమ్మడిగా దాడి చేశాయి. కోతులనుండి తప్పించుకునేందుకు విక్రమ్ అక్కడి నుండి పరిగెడుతుండగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు. విక్రమ్ స్నేహితులు, స్థానికులు కలిసి ఆ కోతులను కర్రలతో తరిమి, బావిలో పడ్డ విక్రమ్ ను కాపాడే ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నం ఫలించక చివరికి పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బందిని వెంటపెట్టుకు వచ్చిన పోలీసులు వారి సహాయంతో బావిలోకి దిగి విక్రమ్ ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో విక్రమ్ కు రెండు చేతులు విరిగిపోవడంతో చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం :